చైనా మాజీ విదేశాంగ మంత్రి కిన్‌ గాంగ్‌ ఆత్మహత్య!

ప్రభుత్వాన్ని ధిక్కరించిన ప్రముఖులు అదృశ్యమైన ఘటనలు చైనాలో అనేకం కనిపిస్తాయి. అదే కోవలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జాడ లేకుండా పోయారు కిన్‌ గాంగ్‌.

Updated : 08 Dec 2023 05:58 IST

లేదా చిత్రహింసలతో మరణించి ఉండొచ్చు
ఆరు నెలలుగా అదృశ్యమైన ఘటనపై అంతర్జాతీయ పత్రికల వెల్లడి

బీజింగ్‌: ప్రభుత్వాన్ని ధిక్కరించిన ప్రముఖులు అదృశ్యమైన ఘటనలు చైనాలో అనేకం కనిపిస్తాయి. అదే కోవలో విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే జాడ లేకుండా పోయారు కిన్‌ గాంగ్‌. అయితే ఆయన చనిపోయి ఉంటారని పలు అంతర్జాతీయ వార్తా కథనాలు తాజాగా పేర్కొన్నాయి. ఆయన ఆత్మహత్య చేసుకోవడమో లేక చిత్రహింసల వల్ల మరణించి ఉండొచ్చని రాసుకొచ్చాయి. జులైలోనే బీజింగ్‌లోని మిలిటరీ ఆసుపత్రిలో ఆయన మృతి చెందారంటూ చైనా ఉన్నతాధికారులతో సన్నిహిత సంబంధాలున్న ఇద్దరు వ్యక్తుల వ్యాఖ్యలను ఉటంకించాయి. ఆ ఆసుపత్రిలో చైనాలోని ఉన్నతస్థాయి వ్యక్తులకు మాత్రమే చికిత్స అందిస్తారట. కిన్‌గాంగ్‌ గతేడాది డిసెంబరులో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు అమెరికాలో చైనా రాయబారిగా ఉన్న ఆయనకు.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌ స్వయంగా పదోన్నతి కల్పించారు. ఆ తర్వాత కొద్దినెలల నుంచే ఆయన అధికారిక కార్యక్రమాల్లో కనిపించడం మానేశారు.

చివరిసారిగా ఈ ఏడాది జూన్‌లో బీజింగ్‌లో జరిగిన సమావేశంలో శ్రీలంక, వియత్నాం, రష్యా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. తర్వాత నుంచి ఆయన ఎక్కడా కనిపించలేదు. అనారోగ్య కారణాలతో ఆయన రాలేదని అప్పట్లో విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కొద్దిరోజుల తర్వాత ఆయన పదవి కూడా పోయింది. ఆయన స్థానంలో వాంగ్‌ యీని నియమించింది. టీవీ జర్నలిస్టు ఫుషియోన్‌తో వివాహేతర బంధమే కిన్‌ గాంగ్‌ కనిపించకుండా పోవటానికి కారణమని వార్తలు వచ్చాయి. ఆమె చైనాలో జన్మించారు. అమెరికా పౌరసత్వం ఉంది. ఆమెతో వివాహేతర సంబంధం వ్యవహారంలో ప్రభుత్వం జరుపుతున్న దర్యాప్తునకు కిన్‌ గాంగ్‌ సహకరిస్తున్నట్లు ఓ అధికారి గతంలో పేర్కొన్నారు.  కిన్‌గాంగ్‌ ద్వారా పుషియోన్‌కు ఒక కుమారుడు జన్మించినట్లు కొన్ని కథనాలు పేర్కొన్నాయి. అయితే ఆమెతో పాటు కుమారుడు కూడా కనిపించటం లేదని వెల్లడించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని