కళ్లకు గంతలు కట్టి.. లోదుస్తులతో తరలింపు

గాజాస్ట్రిప్‌లో అదుపులోకి తీసుకుంటున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ సైన్యం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది.

Updated : 09 Dec 2023 05:35 IST

వివాదాస్పదమవుతున్న ఇజ్రాయెల్‌ సైన్యం తీరు

టెల్‌అవీవ్‌/ఖాన్‌ యూనిస్‌: గాజాస్ట్రిప్‌లో అదుపులోకి తీసుకుంటున్న పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్‌ సైన్యం వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదమవుతోంది. బందీల కళ్లకు గంతలు కట్టి.. చేతులు కట్టేసి కేవలం లోదుస్తుల్లో వారిని ట్రక్కుల్లో తరలించడం.. ఫొటోలు తీయడం.. వాటిని సామాజిక మాధ్యమాల్లో బహిరంగపరచడంపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. గురువారం జబాలియా శరణార్థి శిబిరంపై దాడి సందర్భంగా ఇజ్రాయెల్‌ రక్షణ బలగాలు (ఐడీఎఫ్‌) భారీ సంఖ్యలో పాలస్తీనియన్లను అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం ఫొటోలను విడుదల చేశాయి. వీరంతా హమాస్‌ మిలిటెంట్లని, లొంగిపోయారని పేర్కొన్నాయి. అయితే ఇందులో సాధారణ పాలస్తీనా పౌరులే అధిక సంఖ్యలో ఉన్నారని వివిధ మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. బందీల పరిస్థితి దయనీయంగా ఉందని ‘యూరో-మెడిటేరియన్‌ హ్యూమన్‌రైట్స్‌ మానిటర్‌’ సంస్థ ఆరోపించింది. వలస వెళుతున్న వారిని, వైద్యులు, విద్యావేత్తలు, జర్నలిస్టులు, వృద్ధులను ఇజ్రాయెల్‌ దళాలు ఏకపక్షంగా అరెస్టు చేసి ఇబ్బంది పెడుతున్నాయని తెలిపింది. అల్‌-అరబి అల్‌-జదీద్‌ వార్తాసంస్థ ఈ ఫొటోలపై స్పందిస్తూ.. బందీల్లో తమ ప్రతినిధి కూడా ఒకరు ఉన్నారని వెల్లడించింది. వీరిని గాజాలోని అల్‌-అరబ్‌ కార్యాలయంలో ఇజ్రాయెల్‌ దళాలు అరెస్టు చేశాయని పేర్కొంది.

వీరిని అరెస్టు చేశాక దుస్తులు తొలగించి.. ఓ గుర్తుతెలియని ప్రదేశానికి తరలిస్తోందని వెల్లడించింది. ఐడీఎఫ్‌ ప్రతినిధి డానియల్‌ హగారి మాట్లాడుతూ ‘‘మేము బందీలకు సంబంధించి చాలా ఫొటోలను చూశాం. వారు హమాస్‌ ఉగ్రవాదులు. ఇజ్రాయెల్‌ దళాలు గ్రౌండ్‌ ఆపరేషన్‌ సందర్భంగా వీరిని అరెస్టు చేశాయి. ఆ ప్రదేశంలో మిగిలిన హమాస్‌ దళాలు నిదానంగా బయటకు వస్తున్నాయి. ఈ చిత్రాల్లోని వారికి హమాస్‌తో సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నాం. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసేందుకు ఆపరేషన్‌ కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నారు.గాజాలో ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం అత్యంత పురాతనమైన ఒమారి మసీదును ఐడీఎఫ్‌ దళాలు పేల్చివేశాయి. ఐదో శతాబ్దానికి చెందిన ఈ మసీదు.. గాజాస్ట్రిప్‌లో అతి పెద్దది. మరోవైపు వెస్ట్‌బ్యాంక్‌లో ఫరా శరణార్థి శిబిరంపై ఇజ్రాయెల్‌ దళాలు జరిపిన కాల్పుల్లో ఆరుగురు పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక అధికారులు తెలిపారు.

ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో తాము అపహరించిన బందీలు చాలా మంది చనిపోయారని హమాస్‌ శుక్రవారం ప్రకటించింది. కొంత మందికి గాయాలు కూడా అయ్యాయని తెలిపింది. ఈ మేరకు హమాస్‌ సాయుధ విభాగం ఖస్సామ్‌ బ్రిగేడ్స్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.

ఇరాక్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై రాకెట్‌ దాడి

బాగ్దాద్‌: ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అత్యంత పటిష్ట భద్రతా వలయంలో ఉండే అమెరికా రాయబార కార్యాలయంపై శుక్రవారం ఉదయం రాకెట్‌ దాడి జరిగింది. ఇరాన్‌ మద్దతు ఉన్న మిలిటెంట్‌ గ్రూపులే ఈ దాడికి కారణమని అనుమానిస్తున్నారు. ఇందులో స్వల్ప ఆస్తి నష్టం జరిగిందని, ప్రాణనష్టం సంభవించలేదని అమెరికా, ఇరాక్‌ అధికారులు తెలిపారు. 14 రాకెట్లు ప్రయోగించగా, అందులో ఒకటి ఎంబసీ గేట్‌ను తాకిందని చెప్పారు. ఇజ్రాయెల్‌ హమాస్‌ యుద్ధం మొదలయ్యాక ఇరాక్‌లోని అగ్రరాజ్య రాయబార కార్యాలయంపై జరిగిన తొలి దాడి ఇదే. ఇప్పటివరకు అమెరికాకు వ్యతిరేకంగా 78 దాడులు జరిగాయని, ఇరాక్‌లో 37, సిరియాలో 41 దాడులు జరిగాయని యూఎస్‌ మిలిటరీ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని