ఎరుపెక్కిన ఎర్రసముద్రం

ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై నవంబరు నుంచి వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా హెలికాప్టర్ల దాడిలో 10 మంది హౌతీలు మృతి చెందారు.

Published : 01 Jan 2024 04:26 IST

రంగంలోకి అమెరికా హెలికాప్టర్లు
హౌతీల మూడు బోట్లు ధ్వంసం
10 మంది తిరుగుబాటుదారుల మృతి

బీరుట్‌: ఎర్రసముద్రంలో రవాణా నౌకలపై నవంబరు నుంచి వరుస దాడులకు తెగబడుతున్న హౌతీ తిరుగుబాటుదారులకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా హెలికాప్టర్ల దాడిలో 10 మంది హౌతీలు మృతి చెందారు. డెన్మార్క్‌ షిప్పింగ్‌ సంస్థ మెర్స్‌ హంగ్‌జౌ రవాణా నౌకను ఆదివారం హౌతీ తిరుగుబాటుదారులు హైజాక్‌ చేసేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం నాలుగు బోట్లలో నౌక సమీపానికి చేరుకున్నారు. ఈ సమయంలో మెర్స్‌ సిబ్బంది పంపిన సందేశాలతో రంగంలోకి దిగిన అగ్రరాజ్య హెలికాప్టర్లు కాల్పులు జరిపాయి. 3 బోట్లను ముంచివేశాయి. నాలుగో బోటు సంఘటనా స్థలం నుంచి తప్పించుకొని వెళ్లిపోయింది. ఈ ఘటనలో 10 మంది హౌతీలు మరణించినట్లు తెలుస్తోంది. ఈ సంఘటన తర్వాత మెర్స్‌ సంస్థ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. 48 గంటల పాటు తమ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సంఘటనపై అమెరికా స్పందిస్తూ.. శనివారం కూడా మెర్స్‌ రవాణా నౌకపై హౌతీలు క్షిపణులను ప్రయోగించారని.. వాటిని తాము తిప్పికొట్టామని తెలిపింది. మళ్లీ ఆదివారం చిన్న బోట్లతో దాడికి ప్రయత్నించారని పేర్కొంది. అమెరికా దాడిపై హౌతీ తీవ్రంగా స్పందించింది. ఎర్రసముద్రంలో అమెరికా సహా ఏ దేశం జోక్యం చేసుకున్నా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు గాజాపై ఇజ్రాయెల్‌ దాడులు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 100 మంది మృతి చెందారని, 286 మంది గాయాలయ్యాయని గాజా ఆరోగ్యశాఖ వెల్లడించింది. గాజాపై తాము చేస్తున్న యుద్ధం ఇప్పట్లో ఆగదని ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు.


అప్రమత్తమైన భారత్‌..

దిల్లీ: అరేబియా సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు పెరుగుతోన్న నేపథ్యంలో భారత నౌకాదళం అప్రమత్తమైంది. నిఘాను మరింత పెంచింది. యుద్ధనౌకలను, ఇతర వ్యవస్థలను మోహరిస్తున్నట్లు పేర్కొంది. ‘‘ఎర్ర సముద్రం, ఏడెన్‌ సింధుశాఖ, మధ్య/ఉత్తర అరేబియా సముద్రంలో గత కొన్ని వారాలుగా వాణిజ్య నౌకలపై దాడులు కొనసాగుతున్నాయి. ఎంవీ రూయెన్‌, ఎంవీ కెమ్‌ ప్లూటోలపై జరిగిన దాడులు భారత్‌ ఈఈజీ (ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌) సమీపానికి చేరినట్లు కనిపిస్తున్నాయి. ఇటువంటి దాడులను దీటుగా తిప్పికొట్టేందుకు గాను సముద్ర నిఘాను గణనీయంగా పెంచాం’ అని భారత నౌకాదళం పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని