రక్షణ ఉత్పత్తుల తయారీలో సహకారం

సైనిక అవసరాలను తీర్చే పలు రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీలో కలిసి పనిచేయాలని భారత్‌-గ్రీస్‌ దేశాలు నిర్ణయించాయి. సాంకేతిక నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల రాకపోకలు రెండు దేశాల మధ్య సాఫీగా కొనసాగేందుకు అవసరమైన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చాయి.

Published : 22 Feb 2024 06:19 IST

వివిధ రంగాల్లో కలిసి పనిచేయాలని భారత్‌-గ్రీస్‌ నిర్ణయం
దిల్లీలో రెండు దేశాల ప్రధానుల భేటీ

దిల్లీ: సైనిక అవసరాలను తీర్చే పలు రక్షణ ఉత్పత్తుల అభివృద్ధి, తయారీలో కలిసి పనిచేయాలని భారత్‌-గ్రీస్‌ దేశాలు నిర్ణయించాయి. సాంకేతిక నిపుణులు, ఉద్యోగులు, వ్యాపారవేత్తల రాకపోకలు రెండు దేశాల మధ్య సాఫీగా కొనసాగేందుకు అవసరమైన ఒప్పందాలను సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసుకోవాలనే అభిప్రాయానికి వచ్చాయి. మన దేశ పర్యటనకు వచ్చిన గ్రీస్‌ ప్రధాని కిరియాకొస్‌ మిట్సోటకిస్‌ బుధవారం దిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను మరింతగా బలోపేతం చేసుకోవడంపై తాము విపులంగా చర్చించుకున్నట్లు ప్రధాని మోదీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇండో-పసిఫిక్‌ ఓషన్స్‌ ఇనీషియేటివ్‌లో భాగస్వామి కావాలని గ్రీస్‌ నిర్ణయించుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాద ముప్పు, ఐరోపాలోని తాజా పరిస్థితులు... ముఖ్యంగా ఉక్రెయిన్‌ సంక్షోభంపై, భారత్‌-పశ్చిమాసియా-ఐరోపా నడవా ద్వారా అనుసంధానాన్ని ఏర్పచుకునే విషయంపైనా వారిద్దరూ మాట్లాడకున్నారని విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి వినయ్‌ క్వాట్రా విలేకరులకు తెలిపారు. భారత్‌-గ్రీస్‌ల మధ్య విమాన సర్వీసులు నడిపేందుకు ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించనున్నారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో భద్రత, శాంతి, సుస్థిరతల పరిరక్షణలో భారత్‌ పాత్ర అత్యంత కీలకమైనదని గ్రీస్‌ ప్రధాని పేర్కొన్నారని వినయ్‌ క్వాట్రా వెల్లడించారు. ఫార్మా, వైద్య పరికరాలు, ఆధునిక సాంకేతికత, నవ్యావిష్కరణలు, నైపుణ్యాల అభివృద్ధి, సైబర్‌ సెక్యూరిటీ, వ్యవసాయం, అంతరిక్ష రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని రెండు దేశాల అగ్రనేతలు నిర్ణయించారు. స్టార్టప్‌ల అనుసంధానతపైనా చర్చించుకున్నారు. ఆరు నెలల క్రితం ప్రధాని మోదీ గ్రీస్‌ను సందర్శించగా...ఇప్పుడు ఆ దేశ ప్రధాని భారత్‌ పర్యటనకు వచ్చారు. ప్రధాని మోదీతో చర్చల(రైసినా డైలాగ్‌)కు ముందు రాష్ట్రపతి భవన్‌ వద్ద కిరియాకొస్‌ మిట్సోటకిస్‌కు సాదర స్వాగతం లభించింది. విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌ కూడా గ్రీస్‌ ప్రధానిని కలుసుకున్నారు.


మోదీ ప్రభుత్వ హయాంలో జిల్లాల మధ్య తగ్గిన ఆర్థిక అసమానతలు

 పీఎం ఆర్థిక సలహా మండలి వెల్లడి

దిల్లీ: ఐక్య ప్రగతిశీల కూటమి(యూపీఏ)-2 ప్రభుత్వ హయాంలో కన్నా ప్రధాని మోదీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)-1 సర్కారు హయాంలో జిల్లాల మధ్య ఆర్థిక అసమానతలు వేగంగా తగ్గిపోయాయని ఓ అధికారిక పత్రం పేర్కొంది. మోదీ పాలనలో జిల్లాలు గణనీయ పురోగతి సాధించాయని, సగటు అభివృద్ధి రేటు కన్నా ఇది 18 శాతం అధికమని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి రూపొందించిన కార్యాచరణ పత్రం వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని