అమెరికా ఉపాధ్యక్ష పదవికి వివేక్‌ రామస్వామి!

అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఉపాధ్యక్షుడిగా ఎంపిక కాగల అభ్యర్థుల జాబితాను తయారుచేస్తున్నారు.

Updated : 22 Feb 2024 06:15 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవికి పోటీచేస్తున్న డోనాల్డ్‌ ట్రంప్‌ తన ఉపాధ్యక్షుడిగా ఎంపిక కాగల అభ్యర్థుల జాబితాను తయారుచేస్తున్నారు. వారిలో భారతీయ అమెరికన్‌ వ్యాపారవేత్త వివేక్‌ రామస్వామి కూడా ఉండటం విశేషం. అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ నామినేషన్‌ కోసం తనతో పోటీపడుతున్న మరో భారతీయ అమెరికన్‌ నిక్కీ హేలీ పేరును ట్రంప్‌ ప్రస్తావించలేదు. మంగళవారం ఫాక్స్‌ న్యూస్‌ టీవీ కార్యక్రమంలో ఆయన ఆరుగురి పేర్లను ప్రస్తావించారు. వారిలో...రామస్వామితో పాటు ఫ్లోరిడా గవర్నర్‌ రాన్‌ డిశాంటిస్‌, సౌత్‌ కరోలినా సెనెటర్‌ టిమ్‌ స్కాట్‌, హవాయికి చెందిన మాజీ పార్లమెంటు సభ్యురాలు తులసీ గబ్బర్డ్‌, ఫ్లోరిడా ఎం.పి బైరన్‌ డోనాల్డ్స్‌, దక్షిణ డకోటా రాష్ట్ర గవర్నర్‌ క్రిస్టీ నోయెమ్‌ ఉన్నారు.

పార్లమెంటుకు భారతీయుని పోటీ

వర్జీనియా రాష్ట్ర ఎగువ సభ సెనెట్‌ సభ్యుడైన భారత సంతతి అమెరికన్‌ సుహాస్‌ సుబ్రహ్మణ్యం (37) ఈసారి ప్రజా ప్రతినిధుల సభకు పోటీచేయనున్నారు. పార్లమెంటు దిగువ సభ అయిన ప్రజా ప్రతినిధుల సభలో ప్రభుత్వ కార్యకలాపాలు, ముఖ్యమైన బిల్లులు స్తంభించిపోతున్నాయనీ, ఈ పరిస్థితిని మార్చడానికి కృషి చేస్తానని ఆయన ప్రకటించారు. వర్జీనియా నుంచి ప్రజాప్రతినిధుల సభలో ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్‌ పార్టీ సభ్యురాలు జెనిఫర్‌ వెక్స్‌ టన్‌ ఈసారి తాను పోటీచేయడం లేదని ప్రకటించడంతో ఆమె శిష్యుడైన సుబ్రహ్మణ్యం బరిలో దిగారు. బెంగళూరు, చెన్నైలకు చెందిన ఆయన తల్లిదండ్రులు హ్యూస్టన్‌లో వైద్యులుగా స్థిరపడ్డారు. సుబ్రహ్మణ్యం 2019లో వర్జీనియా అసెంబ్లీకి, 2023లో వర్జీనియా సెనెట్‌కు ఎన్నికైన మొట్టమొదటి భారతీయ అమెరికన్‌, హిందువుగా రికార్డుకెక్కారు. అంతకుముందు బరాక్‌ ఒబామా ప్రభుత్వంలో సాంకేతిక విధాన సలహాదారుగా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని