సంక్షిప్త వార్తలు (4)

అమెరికా వ్యాప్తంగా టెలికం సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఏటీఅండ్‌టీ, క్రికెట్‌ వైర్‌లెస్‌, వెరిజోన్‌, టీ-మొబైల్‌తోపాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌ డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ వెల్లడించింది.

Updated : 23 Feb 2024 06:29 IST

అమెరికా టెలికం సేవల్లో అంతరాయం

వాషింగ్టన్‌: అమెరికా వ్యాప్తంగా టెలికం సేవల్లో భారీ అంతరాయం ఏర్పడింది. ఏటీఅండ్‌టీ, క్రికెట్‌ వైర్‌లెస్‌, వెరిజోన్‌, టీ-మొబైల్‌తోపాటు ఇతర మొబైల్‌ నెట్‌వర్క్‌లలో కనెక్టివిటీ సమస్య తలెత్తినట్లు డౌన్‌ డిటెక్టర్‌ అనే నెట్‌వర్క్‌ ట్రాకింగ్‌ సైట్‌ వెల్లడించింది. హ్యూస్టన్‌, అట్లాంటా, షికాగో, లాస్‌ ఏంజెలెస్‌, న్యూయార్క్‌, శాన్‌ఫ్రాన్సిస్కో, బ్రూక్లిన్‌ ప్రాంతాల్లోని వినియోగదారులు గురువారం తెల్లవారుజామున సిగ్నల్‌ సమస్యను ఎదుర్కొన్నట్లు సమాచారం.


ట్రంప్‌ కన్నా హేలీకే ఎక్కువ ఎన్నికల నిధులు

వాషింగ్టన్‌: రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష పదవి నామినేషన్‌ కోసం బరిలో ఉన్న భారత సంతతి అభ్యర్థి నిక్కీ హేలీ జనవరి నెలలో డొనాల్డ్‌ ట్రంప్‌ కన్నా ఎక్కువ విరాళాలు పొందగలిగారు. హేలీకి 1.15 కోట్ల డాలర్ల విరాళాలు లభించగా ట్రంప్‌ 88 లక్షల డాలర్లు మాత్రమే పొందగలిగారు. ఇంతవరకు ఆయన ఎన్నికల వ్యయం 1.15 కోట్ల డాలర్లు. అంటే, తనకు అందిన విరాళాలకన్నా ఎక్కువ ఖర్చయింది.


పాక్‌ పంజాబ్‌కు తొలి మహిళా సీఎం మరియం!

లాహోర్‌: పాకిస్థాన్‌ మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె మరియం నవాజ్‌ పంజాబ్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. శుక్రవారం ప్రావిన్షియల్‌ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 50ఏళ్ల మరియం పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌ (నవాజ్‌) పార్టీ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు.


నత్రజనితో మరో మరణశిక్ష అమలుకు అలబామా యత్నాలు!

మాంట్గోమేరీ: నత్రజని వాయువును ఉపయోగించి మరో ఖైదీకి మరణశిక్ష విధించాలని అమెరికాలోని అలబామా రాష్ట్రం ప్రయత్నిస్తోంది. ఇప్పటికే గత నెల 25న కెన్నెత్‌ స్మిత్‌ అనే ఖైదీకి ఈ పద్ధతిలో మరణశిక్ష అమలు చేయడంతో వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. ఈ క్రమంలో అలబామా అటార్నీ జనరల్‌ స్టీవ్‌ మార్షల్‌ కార్యాలయం అలాన్‌ యూజీన్‌ మిల్లర్‌(59) అనే ఖైదీకి మరణశిక్ష అమలు తేదీని నిర్ణయించాలని అలబామా సుప్రీంకోర్టును బుధవారం కోరింది. నైట్రోజన్‌ హైపోక్సియా ద్వారా దీనిని అమలు చేస్తామని తెలిపింది. సబర్బన్‌ బర్మింగ్‌హామ్‌లో ముగ్గురిని కాల్చి చంపిన కేసులో మిల్లర్‌ దోషిగా తేలాడు. అయితే నత్రజని వాడకాన్ని నిరోధించాలని కోరుతూ మరొక మరణశిక్ష ఖైదీ వ్యాజ్యం దాఖలు చేశారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని