పుతిన్‌ను విమర్శించి.. ఆత్మహత్య చేసుకొని!

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విమర్శకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రిగోజిన్‌ మొదలు ప్రతిపక్ష నేత నావల్నీ వరకు.. రకరకాల కారణాలతో విగత జీవులుగా మారారు.

Updated : 23 Feb 2024 06:12 IST

రష్యా యుద్ధ బ్లాగర్‌ మృతిపై కలకలం

మాస్కో: రష్యా అధ్యక్షుడు పుతిన్‌ విమర్శకులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రిగోజిన్‌ మొదలు ప్రతిపక్ష నేత నావల్నీ వరకు.. రకరకాల కారణాలతో విగత జీవులుగా మారారు. ఈ జాబితాలోకి తాజాగా రష్యా యుద్ధ బ్లాగర్‌ ఆండ్రీ మొరజోవ్‌ చేరారు. తొలుత పుతిన్‌కు అనుకూలంగా ఉన్న ఈ బ్లాగర్‌ రష్యా సైన్యంలోనూ విధులు నిర్వహించారు. ఉక్రెయిన్‌ పోరులోనూ పాల్గొన్నారు. అయితే ఇటీవల ఆయన పెట్టిన పోస్టులు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా అద్విద్కా పోరులోనే 16వేల మంది రష్యన్‌ సైనికులు ప్రాణాలు కోల్పోయారని పెట్టిన పోస్టు సైనిక జనరళ్లకు కోపం తెప్పించింది. 44 ఏళ్ల మొరజోవ్‌పై వారు తీవ్ర ఒత్తిడి తెచ్చి ఆ పోస్టును తొలగించేలా చేశారు. టెలిగ్రామ్‌లో పెట్టిన తన ఆఖరి పోస్టులో ఈ యుద్ధ బ్లాగర్‌ తాను ఆత్మహత్య చేసుకోనున్నట్లు ప్రకటించారు. మొరజోవ్‌ మృతిని ఆయనతో పరిచయం ఉన్న న్యాయవాది పెష్కోవ్‌ ధ్రువీకరించారు. తుపాకీతో కాల్చుకొని మొరజోవ్‌ మృతి చెందినట్లు తెలిపారు.

యుద్ధ విమానంలో పుతిన్‌

అణు బాంబులను మోసుకెళ్లగల యుద్ధ విమానంలో గురువారం పుతిన్‌ కో పైలట్‌గా ప్రయాణించారు. టీయూ-160ఎం అనే సూపర్‌ సోనిక్‌ బాంబర్‌ విమానంలో ఆయన 30 నిమిషాలపాటు ఆకాశంలో తిరిగారు. వచ్చే నెలలో రష్యాలో ఎన్నికలతోపాటు పశ్చిమ దేశాలకు హెచ్చరికలు చేయాలన్న ఉద్దేశంతో 71ఏళ్ల పుతిన్‌ యుద్ధ విమానంలో ప్రయాణించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని