చందమామపై తొలి ప్రైవేటు ల్యాండర్‌

అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘ఇంట్యూటివ్‌ మెషీన్స్‌’.. అంతరిక్ష రంగంలో చరిత్ర సృషించింది. చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా దించింది.

Published : 24 Feb 2024 03:27 IST

చరిత్ర సృష్టించిన అమెరికా కంపెనీ
జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలో దిగిన ‘ఒడిస్సియస్‌’

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన ప్రైవేటు కంపెనీ ‘ఇంట్యూటివ్‌ మెషీన్స్‌’.. అంతరిక్ష రంగంలో చరిత్ర సృషించింది. చంద్రుడిపై తొలి వాణిజ్య వ్యోమనౌకను విజయవంతంగా దించింది. 1972లో అపోలో-17 యాత్ర తర్వాత అమెరికా ల్యాండర్‌ ఒకటి జాబిల్లిపై దిగడం ఇదే మొదటిసారి. దీంతో చంద్రుడిపై వాణిజ్య పరిశోధనల శకానికి తెరలేచినట్లయింది. ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ రూపొందించిన ఒడిస్సియస్‌ అనే వ్యోమనౌక.. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో చందమామ దక్షిణ ధ్రువంపై కాలుమోపింది. జాబిల్లికి చేరువయ్యే క్రమంలో కొద్దిసేపు వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయాయి. కమ్యూనికేషన్ల పునరుద్ధరణ తర్వాత ఒడిస్సియస్‌.. చందమామపై దిగినట్లు హ్యూస్టన్‌లోని కంపెనీ కమాండ్‌ సెంటర్‌లో ఇంజినీర్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకూ కమాండ్‌ సెంటర్‌లో ఉత్కంఠగా గడిపిన ఇంజినీర్లలో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. ల్యాండింగ్‌ సాఫీగా సాగిందని, వ్యోమనౌక నిటారుగా దిగిందని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ పేర్కొంది. ఒడిస్సియస్‌ నుంచి తొలి చిత్రాలను డౌన్‌లింక్‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించింది. ఒడిస్సియస్‌లో అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ఈ సంస్థకు చెందిన ఆరు పరిశోధన పరికరాలు ఉన్నాయి. అవి భవిష్యత్‌లో చంద్రుడిపైకి చేపట్టబోయే మానవసహిత యాత్రలకు బాటలు వేస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటికితోడు కొలంబియా స్పోర్ట్స్‌వేర్‌ సంస్థకు చెందిన ఇన్సులేటింగ్‌ జాకెట్‌ వస్త్రం, జెఫ్‌ కూన్స్‌ అనే శిల్పి చెక్కిన 125 మినీ చందమామలు కూడా వ్యోమనౌకలో ఉన్నాయి.


పనిచేసేది వారం

డిస్సియస్‌.. వారంపాటు పనిచేస్తుంది. ఆ తర్వాత ల్యాండింగ్‌ ప్రదేశంలో రాత్రి మొదలవుతుంది. క్రమంగా చీకటి ఆవరిస్తుంది. దీంతో వ్యోమనౌక సౌరఫలకాల విద్యుదుత్పత్తి సాధ్యం కాదు. అలాగే తీవ్ర శీతల వాతావరణం నెలకొంటుంది. గత ఏడాది ఆగస్టులో భారత్‌కు చెందిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక కూడా జాబిల్లి దక్షిణ ధ్రువానికి చేరువలోని ప్రాంతంలోనే దిగిన సంగతి తెలిసిందే. చందమామపై దిగే ప్రైవేటు ల్యాండర్లను నిర్మించడానికి నాసా చేపట్టిన ‘కమర్షియల్‌ లూనార్‌ పేలోడ్‌ సర్వీసెస్‌’ (సీఎల్‌పీఎస్‌) కార్యక్రమం కింద పలు కంపెనీలు కాంట్రాక్టులు పొందాయి. అవి రూపొందించే వ్యోమనౌకల్లో నాసా తన పరికరాలను పంపుతుంది. కాంట్రాక్టు సాధించిన సంస్థల్లో ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ కూడా ఉంది. ఈ కంపెనీతో నాసా.. 11.8 కోట్ల డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒడిస్సియస్‌ దిగువ భాగంలో తమ కంపెనీ ఉద్యోగుల పేర్లను చెక్కామని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ సీఈవో స్టీవ్‌ అల్టెమిస్‌ పేర్కొన్నారు. అవి జాబిల్లి ఉపరితలంపై ముద్రితమవుతాయని తెలిపారు. కార్బన్‌ ఫైబర్‌, టైటానియంతో తయారైన ఈ వ్యోమనౌక ఎత్తు 14 అడుగులు. దీన్ని  గతవారమే భూమి నుంచి ప్రయోగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని