ఈ నెత్తుటి ధారలకు రెండేళ్లు

వేలమంది సైనికులు పిట్టల్లా రాలిపోయారు. ఆయుధ/మందుగుండు నిల్వలు కొవ్వొత్తుల్లా కరిగిపోయాయి. అమాయక ప్రజలు అనేకులు అసువులు బాశారు. ఇళ్లు, పెద్దపెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి.

Published : 24 Feb 2024 04:16 IST

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం ఎన్నటికి ముగిసేనో..!

వేలమంది సైనికులు పిట్టల్లా రాలిపోయారు. ఆయుధ/మందుగుండు నిల్వలు కొవ్వొత్తుల్లా కరిగిపోయాయి. అమాయక ప్రజలు అనేకులు అసువులు బాశారు. ఇళ్లు, పెద్దపెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి. అయినా- ఆ విధ్వంసకాండకు ఇంకా తెరపడలేదు. ఐక్యరాజ్య సమితి వంటి ఘనత వహించిన సంస్థలు చేసేదేం లేక చేతులెత్తేస్తున్నవేళ.. సమీప భవిష్యత్తులో దానికి ముగింపు కనిపించడం లేదు కూడా! ఆ విధ్వంసకాండ మరేదో కాదు.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం! అది శనివారంతో రెండేళ్లు పూర్తిచేసుకొని మూడో ఏడులోకి అడుగుపెడుతోంది.

ఎందుకు మొదలైందంటే..

అమెరికా నేతృత్వంలోని నాటో కూటమి తమ సరిహద్దుల దాకా విస్తరణకు ప్రణాళికలు రచిస్తూ పక్కలో బల్లెంలా తయారవుతోందని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ చాన్నాళ్లుగా ఆగ్రహంతో ఉన్నారు. ఉక్రెయిన్‌ను భాగస్వామ్య దేశంగా చేర్చుకునేందుకు నాటో పావులు కదపడం ఆయనకు సుతరామూ నచ్చలేదు. ఈ ప్రయత్నాల్ని నిలువరించే ప్రణాళికల్లో భాగంగా.. తూర్పు ఉక్రెయిన్‌లోని డాన్‌బాస్‌ ప్రాంతంలో రష్యన్‌ భాష మాట్లాడేవారిపై ఉక్రెయిన్‌ ప్రభుత్వం 2014 నుంచి మారణకాండకు పాల్పడుతోందని ఆరోపిస్తూ 2022 ఫిబ్రవరి 24న ‘ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్‌’ పేరుతో యుద్ధాన్ని ప్రారంభించారు. డాన్‌బాస్‌ విమోచనం, నాజీయిజం నిర్మూలన వంటివి తమ లక్ష్యాలని ఆయన ప్రకటించారు. 

మాస్కో దూకుడు.. కీవ్‌ ప్రతిఘటన

కేవలం మూడు రోజుల్లో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ను రష్యా ఆక్రమించేస్తుందని.. యుద్ధం ఆరంభమైనప్పుడు పలువురు విశ్లేషకులు అంచనా వేశారు. కానీ రెండేళ్లు పూర్తయినా అది జరగలేదు. యుద్ధం తొలినాళ్లలో రష్యా దూకుడుగా వ్యవహరించింది. ఉత్తర, తూర్పు, దక్షిణ సరిహద్దుల నుంచి 2 లక్షలమంది సైనికులను ఉక్రెయిన్‌ భూభాగంలోకి పంపింది. వారు శతఘ్నులు, డ్రోన్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడ్డారు. పలు ప్రాంతాలను ఆక్రమిస్తూ కీవ్‌ శివార్ల వరకు వడివడిగా వెళ్లారు. ఆ నగరాన్ని ఆక్రమించడంలో మాత్రం విఫలమయ్యారు. 2022 మార్చి నెలాఖరుకు- ఉక్రెయిన్‌ ఎదురుదాడుల కారణంగా ఉత్తర, దక్షిణ భూభాగాల్లో వారు వెనక్కి వెళ్లారు. ఆక్రమణల సమయంలో రష్యా బలగాలు బుచా, ఇర్పిన్‌లలో తీవ్రస్థాయి దురాగతాలకు పాల్పడ్డాయి. వందలమంది అమాయక పౌరుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. మరోవైపు- ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్‌, లుహాన్స్క్‌, ఖేర్సన్‌, జపోరిజియా ప్రాంతాలను తమ దేశంలో కలిపేసుకుంటున్నట్లు 2022 అక్టోబరు 5న పుతిన్‌ ప్రకటించారు. అయితే యుద్ధం తొలినాళ్లలో రష్యా దాడులను తప్పించుకోవడం/అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేసిన ఉక్రెయిన్‌ బలగాలు- అమెరికా, పశ్చిమ దేశాల నుంచి ఆయుధ సరఫరా పెరిగాక జోరు పెంచాయి. ఎదురుదాడులతో పుతిన్‌ సేనలకు గట్టి సవాలు విసిరాయి. ఖేర్సన్‌ నగరాన్ని 2022 నవంబరులో తిరిగి తమ వశం చేసుకున్నాయి. ఓ దశలో జపోరిజియాలోనూ పాగా వేసినా.. తర్వాత వెనక్కి తగ్గాల్సి వచ్చింది. 2023 జూన్‌ నుంచి చాన్నాళ్లపాటు ఉక్రెయిన్‌ బలగాలు మరింత దీటుగా ఎదురుదాడులు చేశాయి. క్రమంగా పశ్చిమ దేశాల నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా తగ్గిపోవడంతో డీలాపడ్డాయి.
ఇప్పుడు రష్యా అయిదు షెల్స్‌ను కాలిస్తే.. ఉక్రెయిన్‌ ఒక్క షెల్‌ను మాత్రమే కాల్చగలుగుతోంది. దాదాపుగా ఆత్మరక్షణకే అది పరిమితమవుతోంది.

ఎప్పటికి ముగిసేనో..!

శాంతి కోసం రష్యా, ఉక్రెయిన్‌ బృందాలు యుద్ధం ఆరంభంలో చర్చలు జరిపాయి. 2022 ఏప్రిల్‌లోనే ఓ తాత్కాలిక ఒప్పందానికి అవి చేరువగా వచ్చినా.. చివరి క్షణాల్లో చుక్కెదురైంది. తర్వాత చర్చలు జరగలేదు. భద్రతామండలి సహా ఐక్యరాజ్య సమితిలోనూ సయోధ్యకు అడుగులు పడలేదు. చర్చలకు తాము సిద్ధమేనని పుతిన్‌ చెబుతున్నారు. కానీ ఇప్పటికే తాము ఆక్రమించిన ప్రాంతాలను వెనక్కి ఇవ్వబోమంటున్నారు. నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సాయాన్ని నిలిపివేస్తే యుద్ధం రెండు వారాల్లో ముగుస్తుందని ఇటీవల పుతిన్‌ పేర్కొన్నారు. కీవ్‌కు సహాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లు అమెరికా కాంగ్రెస్‌లో స్తంభించిపోవడం ఇప్పుడు రష్యాకు అనుకూలంగా మారింది.


ప్రస్తుత పరిస్థితేంటి?

దాదాపు 1,500 కిలోమీటర్ల పొడవైన ఫ్రంట్‌లైన్‌ వెంబడి రష్యా ముమ్మర దాడులు కొనసాగిస్తోంది. దొనెట్స్క్‌ రీజియన్‌లో కీలక బఖ్ముత్‌ నగరాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకున్నట్లు 2023 మేలో అది ప్రకటించింది. తాజాగా ఈ నెల 17న అవ్‌దివ్‌కా నగరాన్ని పుతిన్‌ సేనలు స్వాధీనం చేసుకున్నాయి. దీర్ఘశ్రేణి క్రూజ్‌ క్షిపణులు, బాలిస్టిక్‌ క్షిపణులు, షాహిద్‌ డ్రోన్ల దాడులతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరవుతోంది. త్వరలోనే ఉక్రెయిన్‌ భూభాగంలోకి పుతిన్‌ సేనలు మరింతగా చొచ్చుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.


3.15 లక్షలు

యుద్ధంలో మరణించిన/ గాయపడిన రష్యా సైనికుల సంఖ్య (అమెరికా అంచనా)


5 లక్షలు

మరణించిన/ గాయపడిన ఉక్రెయిన్‌ బలగాల సంఖ్య


10,200 

రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో మరణించిన సాధారణ పౌరుల సంఖ్య


17,800 కోట్ల డాలర్లు

ఉక్రెయిన్‌కు మిత్రపక్షాలు వివిధ రూపాల్లో ఇప్పటిదాకా అందించిన సాయం విలువ. దేశాలవారీగా చూస్తే ఇందులో అమెరికాదే సింహభాగం.


1.3 లక్షల కోట్ల డాలర్లు

యుద్ధంతో రష్యా ఆర్థిక వ్యవస్థకు కలిగిన నష్టం


21,100 కోట్ల డాలర్లు

యుద్ధంపై ఇప్పటిదాకా మాస్కో చేసిన ఖర్చు


15,500 కోట్ల డాలర్లు 

ఈ ఏడాది జనవరి నాటికి ఉక్రెయిన్‌ మౌలిక వసతులకు కలిగిన నష్టం విలువ

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని