ఇక మా నియంత్రణలోనే గాజా

ఒకవైపు కాల్పుల విరమణ కోసం చర్చలు పారిస్‌లో జోరందుకుంటున్న వేళ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గురువారం కీలక పత్రాన్ని తన వార్‌ కేబినెట్‌ ముందు ఉంచారు.

Published : 24 Feb 2024 04:15 IST

మొత్తం ప్రాంతాన్ని నిస్సైనికీకరణ చేస్తాం
యుద్ధానంతర ప్రణాళికను వెల్లడించిన ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు

టెల్‌ అవీవ్‌: ఒకవైపు కాల్పుల విరమణ కోసం చర్చలు పారిస్‌లో జోరందుకుంటున్న వేళ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు గురువారం కీలక పత్రాన్ని తన వార్‌ కేబినెట్‌ ముందు ఉంచారు. ఈ పత్రంలో ప్రస్తుతం హమాస్‌తో జరుగుతున్న యుద్ధం ముగిసిన తర్వాత గాజాను ఎలా నియంత్రించాలన్న ప్రణాళికను వివరించారు. గాజాను నిస్సైనికీకరణ చేస్తామని, భద్రతతో పాటు పాలనా వ్యవహారాలను కూడా తమ చేతుల్లో తీసుకుంటామని పేర్కొన్నారు. వెస్ట్‌ బ్యాంక్‌, గాజా సహా జోర్డాన్‌ పశ్చిమభాగంలో భద్రతా నియంత్రణ మొత్తం ఇజ్రాయెల్‌ చేతిలో ఉంటుందని ప్రతిపాదించారు. పాలస్తీనాను ప్రత్యేక ప్రాంతంగా గుర్తించడాన్ని నెతన్యాహు తోసిపుచ్చారు. పాలస్తీనియన్లతో పరిష్కారం అనేది రెండు పక్షాల మధ్య ప్రత్యక్ష చర్చల ద్వారానే సాధ్యపడుతుందని చెప్పారు. అయితే, పాలస్తీనియన్ల వైపు ఎవరు ఈ చర్చలకు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయాన్ని వెల్లడించలేదు. రఫా క్రాసింగ్‌తోపాటు స్థానికంగా స్మగ్లింగ్‌ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఈజిప్టు, అమెరికాలకు సహకరిస్తామన్నారు. గాజాలో శాంతిభద్రతలను కాపాడుతూ హమాస్‌ పాలనను భర్తీ చేసేందుకు స్థానిక ప్రతినిధులతో కలిసి పనిచేస్తామని సూచించారు. అయితే, ఉగ్రవాద దేశం లేదా గ్రూపులతో సంబంధం లేనివారితోనే కలిసి నడుస్తామని పేర్కొన్నారు. ఐరాస నేతృత్వంలోని పాలస్తీనా శరణార్థి ఏజెన్సీని మూసివేయాలని.. దాని స్థానంలో ఇతర అంతర్జాతీయ సహాయ బృందాలను కొనసాగించాలని నెతన్యాహు తన ప్రతిపాదనలో పేర్కొన్నారు. మరోవైపు హమాస్‌-ఇజ్రాయెల్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. పారిస్‌లో చర్చలు జరుగుతున్నాయి. ఇందులో అమెరికా, ఈజిప్టు, ఖతర్‌ కీలక పాత్ర పోషిస్తున్నాయి. రంజాన్‌లోపు ఈ ఒప్పందాన్ని ఒక కొలిక్కి తేవాలని అవి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

తాజా దాడుల్లో 71 మంది మృతి

ఇజ్రాయెల్‌ సైన్యం వైమానిక, భూతల దాడులతో గాజాపై విరుచుకుపడింది. గురువారం రాత్రి నుంచి జరిగిన దాడుల్లో దక్షిణ, మధ్య గాజా ప్రాంతాల్లోని నగరాల్లో 71 మంది పౌరులు మరణించారు. మృతుల్లో సగం మంది మహిళలు, చిన్నారులే ఉన్నట్లు గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. వందలాది మంది గాయపడ్డారని, చాలామంది పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. ఇక క్షతగాత్రుల ఆర్తనాదాలతో ఆస్పత్రులు మార్మోగుతున్నాయి. వైద్య సిబ్బంది, ఔషధాలు లేక దెయిర్‌ అల్‌ బలాహ్‌ ఆస్పత్రి నరకాన్ని తలపిస్తోంది. ఉత్తరగాజాలో యుద్ధం ముగిసినట్లు ప్రకటించిన వేళ నెతన్యాహూ సేనలు ఇప్పుడు దక్షిణ మధ్య ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంటున్నాయి. 15 లక్షల మంది ఉన్న రఫా నగరాన్ని ఇజ్రాయెల్‌ బలగాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. హమాస్‌ తమ దగ్గరున్న బందీలను విడుదల చేయకపోతే మరింత బీభత్సం తప్పదని ఇజ్రాయెల్‌ వార్‌ కేబినెట్‌ సభ్యుడు హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని