ఉక్రెయిన్‌ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుడు!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన ఓ భారతీయుడు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. రష్యా ఆక్రమిత దొనెట్స్క్‌ ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.

Published : 26 Feb 2024 04:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో చిక్కుకుపోయిన ఓ భారతీయుడు మరణించినట్లు వార్తలొస్తున్నాయి. రష్యా ఆక్రమిత దొనెట్స్క్‌ ప్రాంతంపై ఫిబ్రవరి 21న ఉక్రెయిన్‌ జరిపిన క్షిపణి దాడిలో అతడు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరో భారతీయుడు ఈ దాడి నుంచి తప్పించుకున్నాడు. మృతుడిని సూరత్‌కు చెందిన హేమిల్‌ అశ్విన్‌భాయ్‌ మంగుకియాగా గుర్తించారు. అతడు డిసెంబరు 2023లో రష్యాకు వెళ్లాడు. అక్కడ అతడిని సైన్యంలోకి పంపారు.  హేమిల్‌ను స్వదేశం తీసుకురావాలని కోరుతూ అతడి తండ్రి తరఫున ఏజెంట్‌ ఇటీవలే విదేశీ వ్యవహారాల శాఖకు లేఖ రాశాడు. దీనికి తోడు ఇప్పటికే అక్కడ చిక్కుకుపోయిన పలువురు భారతీయులు రాయబార కార్యాలయాన్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. హేమిల్‌ మృతిపై తమకు ఎలాంటి సమాచారం లేదని విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది.

మరోవైపు అదే యుద్ధంలో చిక్కుకుపోయిన కర్ణాటకకు చెందిన 23 ఏళ్ల సమీర్‌ అహ్మద్‌ ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ దాడి జరిగిన రోజు ఓ డ్రోన్‌ ఎగరడాన్ని గమనించానన్నాడు. తనకు 150 మీటర్ల దూరంలో హేమిల్‌ తుపాకీ కాల్చడాన్ని సాధన చేస్తున్నట్లు వెల్లడించాడు. అంతలో హఠాత్తుగా భారీ చప్పుడు వచ్చిందన్నాడు. ఆ సమయంలో తనతో సహా ఇద్దరు భారతీయులు, రష్యా సైనికులు కందకంలో దాక్కొన్నట్లు పేర్కొన్నాడు. కొద్దిసేపటి తర్వాత అక్కడికి వెళ్లి చూడగా హేమిల్‌ చనిపోయినట్లు తెలిసిందన్నాడు. కొందరి సాయంతో అతడి మృతదేహాన్ని ఓ ట్రక్కులోకి ఎక్కించానని వెల్లడించాడు. ఆ దాడిలో కొందరు నేపాలీలు కూడా చనిపోయినట్లు చెబుతున్నాడు. హేమిల్‌ మృతదేహాన్ని రెండు నెలల తర్వాత భారత్‌కు అప్పగించే అవకాశం ఉందని రష్యా కమాండర్‌ చెప్పినట్లు పేర్కొన్నాడు. వాస్తవానికి తూర్పు ఉక్రెయిన్‌లోని రష్యా సైనికుల శిక్షణ శిబిరంపై జరిగిన దాడిలో కనీసం 60 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రష్యా నుంచి తమను ఎలాగైనా బయటపడేయాలని విదేశాంగ శాఖను కోరాడు. దాదాపు 100 మంది వరకు భారతీయులు ఆ యుద్ధంలో ఉన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు