రష్యాకు అండగా ఉత్తర కొరియా అధినేత

ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు అండగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ నిలబడ్డారు. మాస్కో మందుగుండు సామగ్రి కొరతను తీరుస్తున్నారు.

Updated : 29 Feb 2024 05:55 IST

6,700 షిప్పింగ్‌ కంటైనర్లలో మాస్కోకు ఆయుధాలు తరలించిన కిమ్‌!

ఇంటర్నెట్‌డెస్క్‌: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు అండగా ఉత్తరకొరియా అధినేత కిమ్‌ నిలబడ్డారు. మాస్కో మందుగుండు సామగ్రి కొరతను తీరుస్తున్నారు. గతేడాది జులై మొదలుకొని ప్యాంగ్యాంగ్‌... దాదాపు 6,700 షిప్పింగ్‌ కంటైనర్లలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని మాస్కోకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని దక్షిణకొరియా చెబుతోంది. ఆ దేశ మంత్రి షిన్‌ ఒన్‌ సిక్‌ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ కంటైనర్లలో 30 లక్షల 152 ఎంఎం శతఘ్ని గుండ్లను, 5,00,000 వరకు 122 ఎంఎం రౌండ్స్‌ గానీ తరలించి ఉండొచ్చని పేర్కొన్నారు. ముడిపదార్థాలు, విద్యుత్తు కొరత కారణంగా ఉత్తర కొరియాలో ఆయుధ కర్మాగారాలు సామర్థ్యంలో 30శాతం మేరకే పనిచేస్తున్నాయి. కానీ, రష్యాకు తరలించే గుండ్లను మాత్రం వేగంగా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న కాలంలో ఉ.కొరియా మరో ఉపగ్రహాన్ని కక్ష్యలోకి చేర్చనున్నట్లు తెలుస్తోందన్నారు. దీనికి రష్యా పూర్తిస్థాయిలో సహకరిస్తోందని ఆరోపించారు. వైమానిక, ఇతర పరికరాల సాంకేతికతను కిమ్‌ సర్కారు అడుగుతోందని చెప్పారు. మరోవైపు అమెరికా విదేశాంగశాఖ లెక్కలు మాత్రం ఇంతకంటే అధికంగా ఉన్నాయి. గత సెప్టెంబర్‌ మొదలుకొని ఉత్తరకొరియా నుంచి దాదాపు 10 వేల కంటైనర్లలో ఆయుధాలు రష్యాకు సరఫరా అయినట్టు అవి చెబుతున్నాయి. దీనికి ప్రతిగా ప్యాంగ్యాంగ్‌కు 9,000 కంటైనర్లలో ఆహార పదార్థాలను మాస్కో సరఫరా చేసినట్లు తెలుస్తోంది. వీటితో ఆ దేశంలో ధరలను అదుపు చేసినట్లు సమాచారం. ఇటీవలే కిమ్‌-పుతిన్‌ స్నేహం మరోసారి ప్రపంచానికి తెలిసింది. వ్యక్తిగతంగా ఉ.కొరియా అధినేతకు వాహనాలంటే చాలా ఇష్టం. ఆయన వద్ద అత్యంత విలాసవంతమైన కార్లు చాలా ఉన్నాయి. సెప్టెంబర్‌లో రష్యా పర్యటనకు వెళ్లినప్పుడు పుతిన్‌ కారు ఆరస్‌ సెనేట్‌ లిమోసిన్‌ను కిమ్‌ ఆసక్తిగా పరిశీలించారు. దీన్ని గమనించిన పుతిన్‌ ఆయన్ని కారులో ఎక్కించుకొని స్వయంగా డ్రైవ్‌ చేసినట్లు కథనాలు వెలువడ్డాయి. ఆ తర్వాత అదే కారును ఆయనకు బహుమతిగా పంపారు. కిమ్‌ దగ్గర మెర్సిడెస్‌, రోల్స్‌ రాయిస్‌ వంటి పలు లగ్జరీ కార్లు ఉన్నట్లు సమాచారం. వాస్తవానికి వీటిని ఉత్తర కొరియాకు ఎగుమతి చేయడంపై ఐరాస నిషేధం విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని