మిషిగన్‌ ప్రైమరీలో బైడెన్‌, ట్రంప్‌ విజయం

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రైమరీల్లో గెలిచిన ట్రంప్‌ తాజాగా మిషిగన్‌ ప్రైమరీలోనూ తన సత్తా చాటారు.

Published : 29 Feb 2024 04:19 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ వరుస విజయాలు సాధిస్తున్నారు. ఇప్పటికే నాలుగు ప్రైమరీల్లో గెలిచిన ట్రంప్‌ తాజాగా మిషిగన్‌ ప్రైమరీలోనూ తన సత్తా చాటారు. మంగళవారం జరిగిన ఈ ఎన్నికల్లో ట్రంప్‌ 66.4 శాతం ఓట్లు సాధించి ప్రత్యర్థి నిక్కీ హేలీపై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. మరోవైపు అదే రాష్ట్రంలో డెమోక్రాట్ల తరఫున ఆ పార్టీ నేత జో బైడెన్‌ కూడా విజయం సాధించారు. అయితే, ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో బైడెన్‌ వైఖరికి నిరసనగా డెమోక్రాటిక్‌ పార్టీలోని ముస్లిం ఓటర్లు ఆయనకు మద్దతివ్వకుండా తటస్థంగా ఉన్నట్లు తెలిసింది. ఆ పార్టీ ఓటర్లలో వీరు 14శాతంగా ఉన్నారు. 


బైడెన్‌కు ప్రత్యామ్నాయం మిషెల్‌ ఒబామా!

వయసురీత్యా అధ్యక్ష ఎన్నికల బరి నుంచి బైడెన్‌ వైదొలగాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఏ కారణంగానైనా బైడెన్‌ స్థానంలో మరొకరిని పోటీకి దించాల్సి వస్తే ఎవరిని ఎన్నుకుంటారనే ప్రశ్నకు డెమోక్రాట్లు అనూహ్య సమాధానమిచ్చారు. దాదాపు 48 శాతం మంది బైడెన్‌ స్థానంలో పార్టీ మరొక అభ్యర్థిని ఎంపిక చేయడానికి సమ్మతిస్తున్నట్లు తెలిపారు. 38 శాతం మంది నిరాకరించారు. అయితే, అభ్యర్థిని మార్చే అవకాశం ఉందని 33 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. బైడెన్‌కు ప్రత్యామ్నాయంగా సర్వేలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, విదేశాంగ శాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ నూసోమ్‌, మిషిగన్‌ గవర్నర్‌ విట్మర్‌, మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామా పేర్లను ఉంచారు. అత్యధికంగా 20 శాతం మంది మిషెల్‌ అభ్యర్థిత్వానికి మొగ్గు చూపారు. 15 శాతం మంది కమలా హారిస్‌, 13 శాతం మంది హిల్లరీ క్లింటన్‌కు మద్దతుగా నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని