గాజాలో ఘోరం

గాజాలో ఘోరం జరిగింది. గాజా సిటీలో మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై గురువారం ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరపడంతోపాటు కాల్పులకు దిగడంతో 104 మంది మరణించారు.

Updated : 01 Mar 2024 06:30 IST

సాయం కోసం ఎదురుచూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడి
ఆ తరవాత ఆహారం కోసం ఎగబడినవారిపై కాల్పులు
104 మంది మృతి ; 760 మందికి గాయాలు
రఫా

(ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు)

గాజాలో ఘోరం జరిగింది. గాజా సిటీలో మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై గురువారం ఇజ్రాయెల్‌ వైమానిక దాడి జరపడంతోపాటు కాల్పులకు దిగడంతో 104 మంది మరణించారు. 760 మంది గాయపడ్డారు. తొలుత వైమానిక దాడి జరిపిన ఇజ్రాయెల్‌ సైన్యం ఆ తరువాత ట్రక్కులవద్ద ఆహార పదార్థాల కోసం ఎగబడిన వారిపై కాల్పులు జరిపిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దాడి ప్రాంతానికి వెళ్లేసరికి వందల మంది నేలపై చనిపోయి, గాయపడి పడి ఉన్నారని కమల్‌ అద్వాన్‌ ఆసుపత్రి అంబులెన్స్‌ సేవల అధిపతి అఫానా తెలిపారు. మృత దేహాలను, గాయపడిన వారిని తరలించడానికి అంబులెన్సులు సరిపోకపోవడంతో గాడిద, గుర్రపు బండ్లపై తరలించామని వెల్లడించారు. గాయపడిన వారు ఇంకా ఆసుపత్రికి వస్తున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యాధికారులు తెలిపారు. కాల్పులను ఇజ్రాయెల్‌ ధ్రువీకరించింది. అయితే సైనికులపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో కాల్పులు జరపాల్సి వచ్చిందని వెల్లడించింది. ట్రక్కులవద్ద ఆహారం కోసం జరిగిన తోపులాట, తొక్కిసలాటతోపాటు జనంపై నుంచి ట్రక్కులు వెళ్లడంతో డజన్ల మంది మరణించారని పేర్కొంది.

ఆహారం లేక తాము పశువుల దాణా తింటున్నామని, ఆహార ట్రక్కులు వచ్చాయని తెలియడంతో అంతా ఒక్కసారిగా అక్కడికి వెళ్లామని, ఈ సమయంలోనే ఇజ్రాయెల్‌ సైనికులు కాల్పులు జరిపారని ఈ ఘటనలో గాయపడిన కమెల్‌ అబు నహెల్‌ తెలిపారు. జనాన్ని చెదరగొట్టేందుకు సైన్యం కాల్పులు జరిపిందని, దీంతో చాలా మంది కార్ల కింద దాక్కున్నారని, కాల్పులు ఆగాక మళ్లీ ఆహార సంచుల కోసం ఎగబడ్డారని, దీంతో మరోసారి కాల్పులు జరిగాయని వివరించారు. కాల్పులతోపాటు ఇజ్రాయెల్‌ షెల్‌ను ప్రయోగించిందని అలా అబు దైయా అనే మరో బాధితుడు తెలిపారు. కాల్పుల సమయంలో తాను రెండు గంటలపాటు నేలపై పడుకుని ఉన్నానని కాల్పుల్లో గాయపడ్డ అహ్మద్‌ వెల్లడించారు. ఈ ఘటనను మారణ హోమంగా గాజా ఆరోగ్యశాఖ పేర్కొంది. మరోవైపు ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజాలో ఇప్పటివరకూ 30,035 మంది మరణించారని, 70,457 మంది గాయపడ్డారని ఆరోగ్యశాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు