ప్రొస్టేట్‌ క్యాన్సర్‌లో రెండు రకాలు

శరీరంలో వేగంగా వ్యాప్తి చెందే కొత్తరకం ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వారు కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించారు.

Published : 02 Mar 2024 03:31 IST

ఏఐ సాయంతో గుర్తించిన శాస్త్రవేత్తలు

దిల్లీ: శరీరంలో వేగంగా వ్యాప్తి చెందే కొత్తరకం ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం వారు కృత్రిమ మేధ (ఏఐ)ను ఉపయోగించారు. దీన్ని బట్టి ఈ వ్యాధిలో రెండు ఉపరకాలు ఉన్నట్లు వెల్లడైంది. సరాసరిన ప్రతి 8 మంది పురుషుల్లో ఒకరు ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడుతుంటారు. ఈ వ్యాధి ఒకేరకంగా కాకుండా భిన్న రీతుల్లో పరిణామం చెందుతుందని తాజా పరిశోధన తేల్చింది. ప్రొస్టేట్‌ క్యాన్సర్‌కు సంబంధించిన వేలాది నమూనాల జన్యు డేటాను విశ్లేషించిన శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. వాటి డీఎన్‌ఏలో తలెత్తుతున్న మార్పులపై అధ్యయనం చేయడానికి ఏఐని వాడారు. ఇందులో రెండు భిన్న క్యాన్సర్‌ సమూహాలను గుర్తించారు. ఇతర మార్గాల్లోనూ దీన్ని నిర్ధరించారు. ఆ తర్వాత ఆ సమాచారం మొత్తాన్నీ క్రోడీకరించి ఈ రెండు ఉపరకాల పరిణామక్రమాన్ని వెలుగులోకి తెచ్చారు. ‘‘ఈ అవగాహన వల్ల కణతులను మెరుగ్గా వర్గీకరించొచ్చు. జన్యు ఉత్పరివర్తనల ఆధారంగా కాకుండా క్యాన్సర్‌ పరిణామం చెందుతున్న తీరును పరిశీలించి వ్యాధిపై ఒక నిర్ధారణకు రావచ్చు’’ అని పరిశోధనకు నేతృత్వం వహించిన డాన్‌ వుడ్‌కాక్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని