టవర్‌ ఆఫ్‌ లండన్‌ ముందు కాకుల కాపలా!

యాభై ఆరేళ్ల రాయల్‌ మెరైన్‌ మాజీ సైనికుడు మైకేల్‌ బార్నీ షాండ్లర్‌ జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇంగ్లాండులో అతి ముఖ్యమైన ‘కాకుల మాస్టర్‌’ ఉద్యోగ బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు.

Published : 02 Mar 2024 08:35 IST

వెయ్యేళ్ల కోటకు వాయసాల రక్షణ

లండన్‌: యాభై ఆరేళ్ల రాయల్‌ మెరైన్‌ మాజీ సైనికుడు మైకేల్‌ బార్నీ షాండ్లర్‌ జ్యోతిషశాస్త్రం ప్రకారం ఇంగ్లాండులో అతి ముఖ్యమైన ‘కాకుల మాస్టర్‌’ ఉద్యోగ బాధ్యతలను శుక్రవారం స్వీకరించారు. థేమ్స్‌ నది తీరంలో గల వెయ్యేళ్ల కోట ‘టవర్‌ ఆఫ్‌ లండన్‌‘కు కాకులు సంరక్షకులుగా ఉండగా.. ఆ కాకులను కాపలా కాస్తూ వాటి యోగక్షేమాలను చూడటమే మైకేల్‌ కొత్త ఉద్యోగ బాధ్యత. ఈయన కింద మరో నలుగురు సిబ్బంది ఉంటారు. కింగ్‌ విలియం -1 ఇంగ్లాండును జయించిన తర్వాత 1066లో ఈ కోటను నిర్మించారు. మొదట్లో రాజభవనంగా ఉన్న కోట తర్వాత చెరసాలగా మారింది. స్థానికుల విశ్వాసం మేరకు.. ఈ కోట సంరక్షణ బాధ్యతను కాకులు నిర్వహిస్తాయి. కాకులు కోటను వీడి వెళ్లిపోతే వైట్‌ టవర్‌తోపాటు ఇంగ్లాండ్‌ రాజ్యం కూలిపోతుందన్నది ఇక్కడివారి నమ్మిక.

17వ శతాబ్దంలో పాలకుడిగా ఉన్న కింగ్‌ ఛార్లెస్‌ - 2 టవర్‌ వద్ద ఎప్పుడూ ఆరు కాకులు ఉండేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశాడు. గతేడాది కింగ్‌ ఛార్లెస్‌ - 3 పట్టాభిషేకం జరిగాక కాకుల సంఖ్యను ఏడుగా మార్చారు. ఈ కాకులు ఎగిరిపోకుండా రెక్కలను ఎప్పటికప్పుడు అవసరం మేర కత్తిరిస్తూ ఉంటారు. నిత్యం వాటికి మాంసాహారం, ఉడికించిన గుడ్లు, బిస్కెట్లు అందిస్తూ వెటర్నరీ పరీక్షలు కూడా చేయిస్తుంటారు. రోజంతా ఇలా హాయిగా తింటూ తిరిగే కాకులు రాత్రివేళ పంజరాల్లోకి వెళ్లి నిద్రిస్తాయి. ఈ టవర్‌ను చూసేందుకు ఏటా 30 లక్షలమంది పర్యాటకులు వస్తుంటారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని