ప్రపంచంలో ఊబకాయులు 100 కోట్లు

ప్రతిష్ఠాత్మక లాన్సెట్‌ జర్నల్‌ చేసిన విస్తృత అధ్యయనం ఊబకాయ సమస్యపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటినట్లు పేర్కొంది.

Published : 02 Mar 2024 05:13 IST

2022లో భారత్‌లో 1.25 కోట్ల మంది చిన్నారులకుఅధిక బరువు సమస్య
లాన్సెట్‌ అధ్యయనం వెల్లడి

దిల్లీ: ప్రతిష్ఠాత్మక లాన్సెట్‌ జర్నల్‌ చేసిన విస్తృత అధ్యయనం ఊబకాయ సమస్యపై ఆందోళనకర విషయాలను వెల్లడించింది. 2022 నాటికి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య ఏకంగా 100 కోట్లు దాటినట్లు పేర్కొంది. వీరిలో 15.9 కోట్ల మంది చిన్నారులు, కౌమార వయస్కులు కాగా.. 87.9 కోట్ల మంది పెద్దలు ఉన్నట్లు పేర్కొంది. భారత్‌లో 2022లో ఊబకాయం బారినపడిన బాలలు(5 నుంచి 19 ఏళ్ల మధ్య వయస్కులు) 1.25 కోట్ల మంది ఉన్నట్లు వెల్లడించింది. వారిలో 73 లక్షల మంది బాలురు, 52 లక్షల మంది బాలికలు ఉన్నట్లు పేర్కొంది. సాధారణంగా పోషకాహార లోపం అనేది.. తక్కువ బరువు లేదా ఊబకాయానికి దారితీస్తుంది. అయితే, 1990 నుంచి తక్కువ బరువుతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుతోందని ఈ అధ్యయనం తెలిపింది. దీంతో చాలా దేశాల్లో పోషకాహార లోపంతో ఊబకాయం సమస్య పెరుగుతోందని వెల్లడించింది.

నాలుగు రెట్లు పెరిగిన ఊబకాయ సమస్య

1990 నాటితో పోలిస్తే ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ బాధితుల సంఖ్య నాలుగురెట్లు పెరిగిందని అధ్యయనం తెలిపింది. ఈ సర్వే కోసం 190 దేశాల నుంచి దాదాపు 22 కోట్ల మంది బరువు, ఎత్తులను పరిశోధకులు అధ్యయనం చేశారు. వారిలో 5-19 ఏళ్లవారు 6.3 కోట్లు, 20 ఏళ్లకు పైబడిన వారు 15.8 కోట్ల మంది ఉన్నారు.

  • 1990 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఊబకాయ రేటు మహిళల్లో రెట్టింపు కాగా, పురుషుల్లో మూడు రెట్లు పెరిగింది. బాలికల్లో అది 0.1 శాతం నుంచి 3.1 శాతానికి పెరగగా, బాలురలో 0.1 శాతం నుంచి 3.9 శాతానికి పెరిగింది.
  • 33 ఏళ్ల వ్యవధిలో ఊబకాయ రేటు బాలురు, బాలికల్లో నాలుగు రెట్ల కన్నా ఎక్కువగా పెరిగింది.
  • 2022లో ఊబకాయం బారినపడిన చిన్నారులు, కౌమార వయస్కుల సంఖ్య దాదాపు 16 కోట్లు(1990లో 3.1 కోట్లు). వారిలో 6.5 కోట్ల మంది బాలికలు కాగా, 9.4 కోట్ల మంది బాలురు.
  • భారత్‌లో మహిళల్లో ఊబకాయ రేటు 1990 నాటితో పోలిస్తే 1.2 శాతం నుంచి 9.8 శాతానికి పెరిగింది. పురుషుల్లో 0.5 శాతం నుంచి 5.4 శాతానికి ఎగబాకింది. 2022 నాటికి సుమారు 4.4 కోట్ల మంది మహిళలు, 2.6 కోట్ల మంది పురుషులకు ఊబకాయం ఉంది.

చిన్నారుల్లోనూ ఊబకాయం ఆందోళనకరం

గతంలో ఊబకాయం పెద్దవాళ్లలో మాత్రమే కన్పించేదని, కానీ ఇప్పుడు పాఠశాలకు వెళ్లే చిన్నారులు, టీనేజర్లనూ ఈ సమస్య వేధిస్తుండం తీవ్ర ఆందోళనకరమని ఈ అధ్యయనంలో పాల్గొన్న మద్రాస్‌ డయాబెటిస్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ నిపుణురాలు గుహ ప్రదీప పేర్కొన్నారు. ‘‘పేద దేశాల్లో కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. వాతావరణ మార్పులు, కొవిడ్‌-19 ఆటంకాలు, రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా పేదరికం పెరిగింది. పోషకాహార ధరలూ పెరిగాయి. ఫలితంగా చాలా మందికి నాణ్యమైన ఆహారం లభించక ఊబకాయం బారిన పడ్డారు’’ అని ఆమె చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని