సంక్షిప్త వార్తలు(3)

యూఏఈలో నిర్మించిన అతి పెద్ద హిందూ ఆలయాన్ని భక్తుల కోసం సోమవారం తెరిచారు. రూ.700 కోట్లతో నిర్మించిన ఈ మందిరాన్ని గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.

Updated : 02 Mar 2024 06:12 IST

యూఏఈ హిందూ ఆలయంలో భక్తజన సందోహం ఆరంభం

అబుధాబి: యూఏఈలో నిర్మించిన అతి పెద్ద హిందూ ఆలయాన్ని భక్తుల కోసం సోమవారం తెరిచారు. రూ.700 కోట్లతో నిర్మించిన ఈ మందిరాన్ని గత నెలలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించిన సంగతి తెలిసిందే. సోమవారం మినహా అన్ని రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల మధ్య భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చని బీఏపీఎస్‌ హిందూ మందిర్‌ తెలిపింది.


టెక్సాస్‌లో ఆగని మంటలు.. ఇద్దరు మహిళల మృతి

టెక్సాస్‌: అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో మొదలైన మంటలు ఇద్దరు మహిళలను బలి తీసుకున్నాయి. మంటల్లో అతిపెద్దదైన స్మోక్‌హౌస్‌ క్రీక్‌ ఫైర్‌ ప్రతి నిమిషానికి మరింత వేగంగా విస్తరిస్తోంది. ఇది రాష్ట్రంలో దాదాపు 4 వేల చదరపు కి.మీ. మేర వ్యాపించినట్లు అధికారులు తెలిపారు. ఒక్లహామా రాష్ట్రంలోనూ దాదాపు 32వేల ఎకరాలను మంటలు బూడిద చేశాయి. ఈ మంటల కారణంగా సుమారు 16 వందల కుటుంబాలు తమ ఇళ్లను ఖాళీ చేశాయి. బాధితులకు అండగా ఉన్నామని, వారికి అన్ని విధాలా సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ హామీఇచ్చారు.


ఇరాన్‌లో పోలింగ్‌ ప్రారంభం

దుబాయ్‌: ఇరాన్‌లో శుక్రవారం ఉదయం పార్లమెంటరీ ఎన్నికలకు పోలింగ్‌ మొదలైంది. 6.1 కోట్ల మంది ఓటర్లు 290 మంది పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటారు. శనివారం నుంచి ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో 15,000 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మత రాజ్యంలో సమూల సంస్కరణలు రావాలని డిమాండు చేసే వారిని ఈ ఎన్నికల్లో నిషేధించారు. ఇరాన్‌ పార్లమెంటు పదవీ కాలం నాలుగేళ్లు. మతపరమైన మైనారిటీ వర్గాలకు 5 సీట్లు కేటాయించారు. గడచిన రెండు దశాబ్దాలుగా ఇరాన్‌ పార్లమెంటులో అతివాదులదే పైచేయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని