అసిఫ్‌ అలీ జర్దారీకే పాక్‌ అధ్యక్ష పగ్గాలు!

పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా రెండోసారి ఆసిఫ్‌ అలీ జర్దారీ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. శుక్రవారం అధ్యక్ష ఎన్నికకు పాక్‌ ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

Published : 02 Mar 2024 05:02 IST

 ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ అధ్యక్షుడిగా రెండోసారి ఆసిఫ్‌ అలీ జర్దారీ పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయమైంది. శుక్రవారం అధ్యక్ష ఎన్నికకు పాక్‌ ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది. 9న ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ షరీఫ్‌ (పీఎంఎల్‌-ఎన్‌), పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ(పీపీపీ) తమ ఉమ్మడి అభ్యర్థిగా జర్దారీ పేరును ఖరారు చేశాయి. జర్దారీ 2008-13 మధ్య కాలంలోనూ పాక్‌ అధ్యక్ష బాధ్యతలను నిర్వహించారు. పాక్‌ మాజీ ప్రధాని, దివంగత బేనజీర్‌ భుట్టో భర్తగా రాజకీయాల్లోకి వచ్చిన జర్దారీ.. తదనంతర కాలంలో పీపీపీ పార్టీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు ఆ పార్టీని జర్దారీ కుమారుడు బిలావల్‌ భుట్టో నడిపిస్తున్నారు. గత నెల 8న జరిగిన పాక్‌ సార్వత్రిక ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో ఏ పార్టీకి మెజారిటీ రాకపోవడంతో పీఎంఎల్‌-ఎన్‌ (75 సీట్లు), పీపీపీ (54).. ఇతర పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఇమ్రాన్‌ఖాన్‌ నేతృత్వంలోని పాకిస్థాన్‌ తెహ్రీకే ఇన్సాఫ్‌ పార్టీకి చెందిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక సీట్లు (93) నెగ్గినా, ప్రతిపక్ష పార్టీకి పరిమితం కానున్నారు. శుక్రవారం నవాజ్‌ షరీఫ్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకుడు సర్దార్‌ అయాజ్‌ సాదిక్‌ పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని