గాజా ఘటనపై ప్రపంచ దేశాల ఆగ్రహం

గాజాసిటీలో మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై గురువారం ఇజ్రాయెల్‌ సైన్యం కాల్పులు జరపడాన్ని ప్రపంచ దేశాలు తప్పుబట్టాయి.

Published : 02 Mar 2024 05:03 IST

చర్చలకు ఆటంకం: బైడెన్‌
తీవ్రంగా ఖండించిన ఐరాస

ఇంటర్నెట్‌ డెస్క్‌: గాజాసిటీలో మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై గురువారం ఇజ్రాయెల్‌ సైన్యం కాల్పులు జరపడాన్ని ప్రపంచ దేశాలు తప్పుబట్టాయి. పలు అంశాల్లో ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉన్న దేశాలూ ఈ ఘటనపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ ఘటనలో 104 మంది మరణించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ దీనిపై స్పందించారు. ఇలాంటి ఘటనలు కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలను మరింత జఠిలం చేస్తాయని వ్యాఖ్యానించారు. అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ మాట్లాడుతూ.. దీనిపై అదనపు సమాచారం పంపించాలని తాము కోరామని, ఈ ఘటనకు బాధ్యులు సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌ ఎక్స్‌ వేదికగా స్పందిస్తూ.. పౌరులను ఇజ్రాయెల్‌ సైన్యం లక్ష్యంగా చేసుకుందని మండిపడ్డారు. ఘటనను తీవ్రంగా ఖండించారు. ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ.. ‘ఆహారం కోసం వచ్చిన ప్రజలపై కాల్పులు జరపడాన్ని ఏమాత్రం సమర్థించుకోలేరు’ అని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌ చర్య ఏమాత్రం ఆమోద యోగ్యం కాదని ఐరోపా సమాఖ్య పేర్కొంది.

  • ఐరాస చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ ఇజ్రాయెల్‌ చర్యను ఖండించారు. గాజా వాసులకు తక్షణమే సాయం అందించాలని ఆయన ప్రతినిధి తెలిపారు. అక్కడ దాదాపు వారం రోజుల నుంచి తమ సిబ్బంది పని చేయలేక పోతున్నారని పేర్కొన్నారు.
  • తుర్కియే ప్రభుత్వం స్పందిస్తూ.. మానవత్వంపై పాల్పడ్డ నేరంగా దీనిని అభివర్ణించింది. ‘ఇజ్రాయెల్‌ ఉద్దేశపూర్వకంగానే అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుంది’ అని ఆ దేశ విదేశాంగశాఖ పేర్కొంది.
  • ఇజ్రాయెల్‌తో ఉన్న ఆయుధ కొనుగోలు ఒప్పందాలను సస్పెండు చేస్తున్నట్లు కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటించారు. గాజాలో చర్యలను నరమేధంగా అభివర్ణించారు. ‘ఆహారం అడిగిన 100 మందిని మీరు చంపారు నెతన్యాహు’ అని ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఖతార్‌, సౌదీ దేశాలు ఇజ్రాయెల్‌ తీరును తప్పుబట్టాయి.

‘గాజా పాత్రికేయులకు రక్షణ కల్పించాలి’

ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ వార్తా సంస్థలకు చెందిన అధిపతులు గాజాలోని జర్నలిస్టులకు సంఘీభావం తెలిపారు. యుద్ధ ప్రాంతంలో పాత్రికేయులకు భద్రత, స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ.. ‘జర్నలిస్టుల భద్రతా కమిటీ’ ఆధ్వర్యంలో 30 మందికిపైగా బహిరంగ లేఖ రాశారు. ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం కారణంగా మీడియాకు చెందిన 89 మంది మరణించారని, వారిలో అధికంగా పాలస్తీనియన్లే ఉన్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాలస్తీనా పాత్రికేయులకు మద్దతు తెలపాల్సిన అవసరముందని అంతర్జాతీయ జర్నలిస్టు సంఘం భావిస్తోందని వివరించారు.


షాక్‌కు గురయ్యాం: భారత్‌

దిల్లీ: గాజా సిటీలో సాయం కోసం ఎదురు చూస్తున్న వారిపై ఇజ్రాయెల్‌ సైన్యం కాల్పులు జరిపిన ఘటనపట్ల భారత్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 104 మంది మరణించడంతో తాము తీవ్ర షాక్‌కు గురయ్యామని పేర్కొంది. గాజాలో భారీగా ప్రాణ నష్టం జరుగుతుండటం, మానవతా సాయం అందకపోవడం తీవ్ర ఆందోళనకర అంశమని శుక్రవారం విదేశాంగశాఖ ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. సురక్షితంగా, సమయానికి సాయం అందించాలని కోరింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని