వారు ఉక్రెయిన్‌కు పారిపోవాలనుకున్నారు

సంగీత కచేరీపై మాస్కో శివార్లలో విరుచుకుపడి 137 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులు ఉక్రెయిన్‌కు పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు.

Published : 25 Mar 2024 04:34 IST

కాల్పుల ముష్కరులపై పుతిన్‌ వెల్లడి
మృతులకు నివాళిగా రష్యాలో సంతాప దినం

మాస్కో: సంగీత కచేరీపై మాస్కో శివార్లలో విరుచుకుపడి 137 మందిని పొట్టనపెట్టుకున్న ముష్కరులు ఉక్రెయిన్‌కు పారిపోయే ప్రయత్నంలో పట్టుబడ్డారని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ తెలిపారు. శుక్రవారం నాటి ఘటనతో తమకేమాత్రం ప్రమేయం లేదని ఉక్రెయిన్‌ తోసిపుచ్చుతుండగా ఆదివారం ఆయన ఈ మేరకు ప్రకటన చేశారు. అఫ్గాన్‌కు చెందిన ఇస్లామిక్‌ స్టేట్‌ గ్రూపు ఈ కాల్పులకు తామే తెగబడినట్లు చెప్పినా.. ఆయన మాత్రం ఈ పేరు ప్రస్తావించలేదు. కాల్పుల ఘటనలో 11 మందిని అదుపులో తీసుకున్నట్లు పుతిన్‌ తెలిపారు. ఈ దాడిని రక్తపాత, అనాగరిక ఉగ్రచర్యగా అభివర్ణించారు. అనుమానితులు నలుగురూ ఉక్రెయిన్‌ వైపు ముందే సిద్ధం చేసుకున్న మార్గం ద్వారా తప్పించుకోవాలని ప్రయత్నించగా తమ బలగాలు పట్టుకున్నాయని చెప్పారు. ముష్కరుల విచారణపై రష్యా ప్రసార మాధ్యమాలు కొన్ని వీడియోలను ప్రసారం చేశాయి. మెసేజింగ్‌ యాప్‌ ద్వారా ఇస్లామిక్‌ బోధకుడి వద్దకు ఒక వ్యక్తి తనను తీసుకువెళ్లి, కాల్పుల్లో పాల్గొనేలా చేశాడని ఒక నిందితుడు చెప్పినట్లు ఒక వీడియోలో ఉంది.

మెసేజింగ్‌ యాప్‌ నుంచే దాడి కుట్ర అమలు

ముష్కరుల్లో ఒకడు అఫ్గాన్‌ సరిహద్దులోని తజకిస్థాన్‌ పౌరుడని కొన్ని మాధ్యమాలు గుర్తించాయి. దాడికి కేవలం ఓ మెసేజింగ్‌ యాప్‌ ద్వారానే కుట్రదారులు రూపం ఇచ్చినట్లు తెలుస్తోంది. డబ్బుల కోసమే కాల్పులు జరిపినట్లు నిందితులు వెల్లడించారు. డబ్బు, ఆయుధాలు సరఫరా చేసినవారెవరో తెలియదని, కేవలం యాప్‌ నుంచే సంప్రదించారని ఒక నిందితుడు వెల్లడించాడు. మృతులకు నివాళిగా ఆదివారం రష్యా అంతటా సంతాపదినం పాటించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని