కాంగ్రెస్‌ బ్యాంకు ఖాతాలపైనా అమెరికా స్పందన

దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించి భారత్‌ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది.

Published : 29 Mar 2024 05:34 IST

న్యూయార్క్‌: దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ అరెస్టుపై స్పందించి భారత్‌ నుంచి అభ్యంతరాలను ఎదుర్కొన్న అమెరికా తాజాగా కాంగ్రెస్‌ పార్టీ బ్యాంకు ఖాతాలపైనా స్పందించింది. ఆ దేశ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కేసుల్లో నిష్పాక్షిక, పారదర్శక, కాలావధితో కూడిన విచారణను తాము కోరుకుంటున్నామని పేర్కొన్నారు. ‘ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకునేలా తమ బ్యాంకు ఖాతాలను ఆదాయపన్ను విభాగం స్తంభింపజేసిందంటూ కాంగ్రెస్‌ పార్టీ చేస్తున్న ఆరోపణలూ మా అవగాహనలో ఉన్నాయి. అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు సహా ఈ కేసులన్నింటిలో తీసుకుంటున్న చర్యలను మేం నిశితంగా గమనిస్తాం’ అని మిల్లర్‌ వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం భారత్‌ తీవ్ర నిరసన తెలిపిన విషయం తెలిసిందే. దిల్లీలోని అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాకు విదేశీ వ్యవహారాలశాఖ సమన్లు కూడా జారీ చేసింది. దక్షిణ బ్లాకులోని విదేశాంగశాఖ కార్యాలయంలో 30 నిమిషాల పాటు అధికారులతో ఆమె సమావేశమయ్యారు. దౌత్య సంబంధాల్లో ఆయా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని తాము భావిస్తున్నామని భారత్‌ తెలిపింది. దీనిపై అమెరికా తిరిగి స్పందిస్తూ.. కాంగ్రెస్‌ ఖాతాల ప్రస్తావననూ తీసుకురావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని