బాల్టిమోర్‌ వంతెన వద్దకు భారీ క్రేన్ల తరలింపు!

అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీ కొట్టడంతో కుప్పకూలిన ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన శకలాలను తొలగించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు.

Published : 30 Mar 2024 05:33 IST

శకలాల తొలగింపునకు కసరత్తు 

బాల్టిమోర్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో నౌక ఢీ కొట్టడంతో కుప్పకూలిన ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెన శకలాలను తొలగించడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం ఒక భారీ క్రేన్‌ను రప్పిస్తున్నారు. ప్రమాదంలో ఆచూకీలేకుండా పోయిన నలుగురు కార్మికుల కోసం చేపడుతున్న గాలింపు చర్యలకు, రేవు కార్యకలాపాలకు ఈ శకలాలు అవరోధంగా మారాయి. ఒక నౌక ద్వారా క్రేన్‌ను రప్పిస్తున్నారు. ఇది వెయ్యి టన్నుల బరువును ఎత్తగలదని మేరీల్యాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూర్‌ తెలిపారు. శకలాల తొలగింపునకు మరో క్రేన్‌ను కూడా రప్పిస్తామన్నారు. ఈ జలమార్గంలో అడ్డంకులను తొలగించడానికి నౌకాదళం కూడా దేశం నలుమూలల నుంచి అవసరమైన సాధన సంపత్తిని ఘటనా స్థలానికి తరలిస్తోంది. వంతెన పునర్‌నిర్మాణానికి అయ్యే ఖర్చును పూర్తిగా ఫెడరల్‌ ప్రభుత్వమే చెల్లిస్తుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. సైనిక, నౌకాదళ ఇంజినీర్లు ఇప్పటికే ఘటనాస్థలి వద్ద సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు. ఆ ప్రాంతాన్ని సోనార్‌తో స్కాన్‌ చేసినప్పుడు.. కాంక్రీటు, ఇతర శకలాల మధ్య వాహనాలు చిక్కుకుపోయినట్లు తేల్చారు. వంతెనను నౌక ఢీ కొనడం ప్రమాదవశాత్తు జరిగిందేనని అర్థమవుతున్నట్లు అధికారులు తెలిపారు. నౌక ఢీ కొన్నాక కొద్దిసెకన్లలోనే వంతెన కూలిందని వివరించారు. ఆలోగా బ్రిడ్జ్‌పై వాహన రాకపోకలను నిలిపివేయగలిగామని, అక్కడ పనిచేస్తున్న నిర్మాణ రంగ సిబ్బందిని అప్రమత్తం చేయలేకపోయామని వివరించారు. అందువల్ల వారు నీటిలో పడిపోయారని తెలిపారు. వారు మెక్సికో, గ్వాటెమాలా, హోండరస్‌, ఎల్‌సాల్వెడార్‌ దేశాలకు చెందినవారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని