ఈస్టర్‌ వేడుకకు వెళ్తుండగా లోయలో పడిన బస్సు

దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈస్టర్‌ వేడుకకు భక్తులను తీసుకెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడింది.

Updated : 30 Mar 2024 06:04 IST

దక్షిణాఫ్రికాలో 45 మంది మృతి

జొహెన్నెస్‌బర్గ్‌: దక్షిణాఫ్రికాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈస్టర్‌ వేడుకకు భక్తులను తీసుకెళుతున్న బస్సు వంతెనపై నుంచి అదుపుతప్పి లోయలో పడింది. గురువారం జరిగిన ఈ ఘటనలో 45 మంది మృతిచెందగా 8 ఏళ్ల బాలిక మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు తెలిపారు. 164 అడుగుల లోతులో బస్సు పడిపోవడంతో మంటలు అంటుకున్నాయని వెల్లడించారు. మృతదేహాలను వెలికి తీయడం కోసం శుక్రవారం కూడా చర్యలు చేపట్టామని వివరించారు. పోలీసుల కథనం ప్రకారం..దక్షిణాఫ్రికాలోని మోరియా పట్టణంలో ఘనంగా జరిగే ఈస్టర్‌ వేడుకలకు పొరుగు దేశమైన బోట్స్‌వానా నుంచి 46 మంది భక్తులు బస్సులో బయలుదేరారు. లిపోపో రాష్ట్రంలో కొండపై నిర్మించిన వంతెన మూలమలుపు వద్ద బస్సు అదుపుతప్పి 164 అడుగుల లోతున్న లోయలో పడింది. దీనిపై సమాచారం అందుకున్న అధికారులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టినట్లు స్థానిక రవాణా శాఖ పేర్కొంది. ప్రమాదంలో బస్సు డ్రైవర్‌ సైతం చనిపోగా, ప్రాణాలతో బతికున్న బాలికను సమీప ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన ఆ బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కొన్ని మృతదేహాలు గుర్తించలేనంతగా మంటల్లో కాలిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. బస్సుపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని