నగ్న ఊరేగింపు ఫొటోకు అవార్డుపై నెట్టింట ఆగ్రహం

హమాస్‌ అకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ చిత్రానికి ఉత్తమ ఫొటో అవార్డు దక్కడం తీవ్ర దుమారం రేపింది.

Published : 30 Mar 2024 05:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ అకృత్యాలకు సజీవ సాక్ష్యంగా నిలిచిన ఓ చిత్రానికి ఉత్తమ ఫొటో అవార్డు దక్కడం తీవ్ర దుమారం రేపింది. ఆ ఫొటోకు ప్రథమ బహుమతి ఇవ్వడంపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గతేడాది హమాస్‌ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌ భూభాగంలోకి చొరబడి నరమేధం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు కొందరు పౌరులను కిడ్నాప్‌ చేసి గాజాకు తరలించారు. ఆ సమయంలో జర్మన్‌ పర్యాటకురాలు షానీ లౌక్‌ను బంధించి నగ్నంగా వీధుల్లో ఊరేగించారు. అప్పట్లో ఈ దృశ్యాలు యావత్‌ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఈ ఘటనపై అసోసియేటెడ్‌ ప్రెస్‌ సంస్థ తీసిన ఒక ఫొటోకు అమెరికాకు చెందిన డొనాల్డ్‌ డబ్ల్యూ.రెనాల్డ్స్‌ జర్నలిజం ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ప్రథమ బహుమతి లభించింది. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో నెట్టింట పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ దారుణాన్ని ఉత్తమ ఫొటోగా ఎంపిక చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ ఫొటోను తొలుత యథాతథంగా ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో పెట్టిన నిర్వాహకులు.. విమర్శలు రావడంతో ఆ తర్వాత దాన్ని తొలగించారు. 2023 అక్టోబరు 7న ఇజ్రాయెల్‌లో సూపర్‌నోవా మ్యూజిక్‌ ఫెస్టివల్‌ జరుగుతున్న సమయంలో హమాస్‌ మిలిటెంట్లు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. గాజా సరిహద్దుకు సమీపంలో హమాస్‌ సృష్టించిన నరమేధంతో ఫెస్టివల్‌ జరిగిన ప్రాంతంలోనే 260 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి కొందరిని బందీలుగా తీసుకెళ్లారు. వారిలో షానీ లౌక్‌ ఒకరు. ఆ తర్వాత కొన్ని రోజులకు ప్రతిదాడుల్లో భాగంగా గాజా భూభాగంలోకి ఐడీఎఫ్‌ దళాలు ప్రవేశించాయి. అప్పుడు షానీ మృతదేహాన్ని గుర్తించారు. ఆమెను తీవ్రంగా వేధించారని, గాజా మొత్తం ఊరేగించారని అప్పట్లో ఇజ్రాయెల్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని