ట్రంప్‌ను గెలవనీయొద్దు

ట్రంప్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనీయొద్దని భారత్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సహా ఇతర సమావేశాల్లో ప్రపంచ నేతలు తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు.

Published : 31 Mar 2024 04:28 IST

ప్రపంచ నేతలు తనతో చెప్పారన్న బైడెన్‌

న్యూయార్క్‌: ట్రంప్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలవనీయొద్దని భారత్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సహా ఇతర సమావేశాల్లో ప్రపంచ నేతలు తనతో చెప్పారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. మళ్లీ ట్రంప్‌ గెలిస్తే తమ దేశాల్లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని వారు చెప్పారని తెలిపారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి నిధి సేకరణకు సంబంధించి న్యూయార్క్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘నవంబరులో ఈసారి తాను మళ్లీ ఓడిపోతే రక్తపాతం జరుగుతుంది అని ట్రంప్‌ మాట్లాడుతున్నారు. ఎలాంటి ఆలోచన కలిగిన వ్యక్తి ఆయన. ఆ వ్యాఖ్యలు నన్ను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి’ అని బైడెన్‌ అన్నారు. ఇదే కార్యక్రమంలో పాల్గొన్న మాజీ అధ్యక్షులు బరాక్‌ ఒబామా, బిల్‌క్లింటన్‌ మాట్లాడుతూ.. ట్రంప్‌ను తప్పనిసరిగా ఓడించాలని పిలుపునిచ్చారు.


నేను విమానం తలుపు పక్కన కూర్చోనుగా..

వాషింగ్టన్‌: తాను విమానం తలుపు వద్ద కూర్చోనని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అన్నారు. ఇటీవల బోయింగ్‌ సంస్థకు చెందిన విమానాల్లో వెలుగుచూస్తోన్న ఘటనలను ఉద్దేశించి ఈ విధంగా చమత్కరించారు. కొద్దినెలల క్రితం అలస్కా ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 మ్యాక్స్‌ 9 విమానం అమెరికాలోని పోర్ట్‌లాండ్‌ నుంచి కాలిఫోర్నియాకు బయలుదేరింది. విమానం 16 వేల అడుగుల ఎత్తుకు చేరగానే.. ఎడమవైపున్న తలుపు ఊడిపోయింది. దాని పక్కనే ప్రయాణికుల సీట్లు ఉన్నాయి. విమానాన్ని వెనక్కి తిప్పి అత్యవసర ల్యాండింగ్‌ చేయడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఓ టాక్‌ షోలో పాల్గొన్న బైడెన్‌తో వ్యాఖ్యాత మాట్లాడుతూ.. ‘మీరు న్యూయార్క్‌కి బయల్దేరే ముందు మీ రవాణాశాఖ మంత్రి.. ఎయిర్‌ ఫోర్స్‌ వన్‌(అధ్యక్షుడు ప్రయాణించే విమానం) బోల్టులు బిగించారా?’ అంటూ ప్రశ్నించారు. దీనిపై బైడెన్‌ బదులిస్తూ..‘నేను తలుపు పక్కన కూర్చోను’ అంటూ బదులిచ్చారు. ఆ వెంటనే కేవలం సరదాకు అన్నానని, ఇలాంటి విషయాల్లో తమాషా చేయకూడదని వ్యాఖ్యానించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని