ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఆకలికేకలు

‘‘ఒక్క చుక్క నూనె కూడా నేను వదలను’’ అంటూ జెనీవ్‌ ఎన్‌క్యూబ్‌ (39) గట్టిగా అరిచింది. తన వాటా కింద వచ్చిన వంటనూనెను ఆమె జాగ్రత్తగా ప్లాస్టిక్‌ బాటిలులో ఒడిసిపట్టింది.

Published : 01 Apr 2024 05:19 IST

క్షుద్బాధతో 2 కోట్లమంది విలవిల
వాతావరణ మార్పుల వైపరీత్యం

మాంగ్వే (జింబాబ్వే): ‘‘ఒక్క చుక్క నూనె కూడా నేను వదలను’’ అంటూ జెనీవ్‌ ఎన్‌క్యూబ్‌ (39) గట్టిగా అరిచింది. తన వాటా కింద వచ్చిన వంటనూనెను ఆమె జాగ్రత్తగా ప్లాస్టిక్‌ బాటిలులో ఒడిసిపట్టింది. ఆఫ్రికా దక్షిణ ప్రాంత దేశమైన జింబాబ్వే గ్రామీణ విభాగంలోని మాంగ్వే జిల్లా ఆహార పంపిణీ కేంద్రం వద్ద కనిపించిన దృశ్యమిది. వీపున ఏడు నెలల బిడ్డను మోస్తూ వచ్చిన ఈమెతోపాటు దాదాపు రెండు వేలమంది ఆ కేంద్రంలో ఇస్తున్న వంటనూనె, జొన్నలు, బఠాణీలు తదితర రేషను సరకులు అందుకొన్నారు. యువత, వృద్ధులు అందరూ వరుసలో నిలుచున్నారు. ఇచ్చిన సరకులు తీసుకువెళ్లేందుకు కొందరు గాడిద బండ్లు, చక్రాల బళ్లు తెచ్చుకున్నారు. ఎంతోమంది నేలపైనే కూర్చొని తమ వంతు కోసం ఎదురుచూస్తున్నారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో దుర్భరమైన కరవు ఈ ప్రాంతంలో కొనసాగుతోంది. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ‘ప్రపంచ ఆహార కార్యక్రమం’ కింద అమెరికాకు చెందిన ‘యూఎస్‌ఏఐడీ’ (యునైటెడ్‌ స్టేట్స్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌) సంస్థ ఇక్కడ ఆహార పంపీణీ కేంద్రాలు నిర్వహిస్తోంది. ఉచిత రేషను కోసం వచ్చిన బాధితులకు ఈ ఏజెన్సీ సిబ్బంది పిడుగులాంటి వార్త చెప్పారు. ‘ఇదే మా చివరి పంపిణీ’ అంటూ వారు చెప్పిన మాటలు విని బాధితులంతా ఉస్సూరుమని నిట్టూర్చారు. గతేడాది ఆఖరు నుంచి ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని పలు భాగాల్లో దుర్భిక్షం తాండవిస్తోంది. గ్రామీణ జింబాబ్వేలోని 27 లక్షల మంది బాధితులను ఆదుకొనే లక్ష్యంతో ఈ ఏజెన్సీ పనిచేస్తోంది. లక్షలమంది ప్రజలకు ఆధారమైన పంటలను కరవు కాటకాలు తుడిచిపెట్టేశాయి.

జింబాబ్వేతోపాటు పొరుగున ఉన్న జాంబియా, మలావీ వంటి దేశాలూ తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. జాంబియా, మలావీ ఇప్పటికే జాతీయ విపత్తు నెలకొన్నట్లు ప్రకటించాయి. ఇపుడు జింబాబ్వే కూడా ఇదే వరుసలో ఉంది. పశ్చిమాన బోట్స్‌వానా, అంగోలా దేశాలకు.. తూర్పున మొజాంబిక్‌, మడగాస్కర్‌ దేశాలకు కరవు విస్తరించింది. ఏడాది క్రితం ఇదే ప్రాంతాన్ని ఘోరమైన ఉష్ణమండల తుపానులు, వరదలు ముంచెత్తాయి. ఇది వాతావరణ వైపరీత్యాల ప్రభావమని శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తున్నారు. క్షుద్బాధతో బాధ పడుతున్నవారిలో సగానికి పైగా పిల్లలే ఉన్నారని ‘యునిసెఫ్‌’ తెలిపింది. మానవ నిర్మిత వాతావరణ మార్పులు ప్రపంచవ్యాప్తంగా అస్థిర పరిస్థితులకు దారితీస్తుండగా.. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలో ఈ ఏడాది దాని తీవ్రత మరింత ఎక్కువగా ఉంది. ‘‘ఇంతటి దారుణమైన పరిస్థితులు నేనెప్పుడూ చూడలేదు. జలవనరులన్నీ ఎండిపోయాయి. అటవీ ఫలాలు తిని బతికేవాళ్లం. అవి కూడా ఎండిపోయాయి. ఆహారం కోసం జనం అక్రమంగా బోట్స్‌వానాలోకి చొరబడుతున్నారు. శ్రమజీవులను ఈ ఆకలి నేరస్థులుగా మారుస్తోంది’’ అని మాంగ్వేకు చెందిన స్థానిక నాయకుడు జోసెఫ్‌ (77) చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని