సంక్షిప్త వార్తలు (4)

ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీలో మంగళవారం హృదయ విదారక ఘటన జరిగింది. వాన్టా నగరంలోని వియెర్టోలా పాఠశాలలో 12 ఏళ్ల విద్యార్థి లైసెన్స్‌డ్‌ తుపాకీతో కాల్పులు జరిపాడు.

Updated : 03 Apr 2024 06:32 IST

ఫిన్లాండ్‌లో 12ఏళ్ల విద్యార్థి కాల్పులు
ఓ విద్యార్థి మృతి.. మరో ఇద్దరికి గాయాలు

హెల్సింకీ: ఫిన్లాండ్‌ రాజధాని హెల్సింకీలో మంగళవారం హృదయ విదారక ఘటన జరిగింది. వాన్టా నగరంలోని వియెర్టోలా పాఠశాలలో 12 ఏళ్ల విద్యార్థి లైసెన్స్‌డ్‌ తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వియెర్టోలా పాఠశాలలో దాదాపు 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. కాల్పులపై వేగంగా స్పందించిన పోలీసులు, నిందితుడిని హెల్సింకీలో అదుపులోకి తీసుకున్నారు. కాల్పులకు ఉపయోగించిన తుపాకీ నిందితుడి బంధువుదని, లీగల్లీ రిజిస్టర్‌ అయిందని పేర్కొన్నారు. కాగా, కాల్పులకు గల కారణం మాత్రం ఇంకా తెలియరాలేదు. ఫిన్లాండ్‌ చట్టాల ప్రకారం శిక్షకు కనీస వయస్సు 15 సంవత్సరాలు కావడం వల్ల నిందితుడిని అధికారికంగా అరెస్టు చేయడం సాధ్యం కాదు. ఈ కేసును ఫిన్లాండ్‌ శిశు సంరక్షణ విభాగం విచారిస్తుంది.


కోర్టుకు ట్రంప్‌ రూ. 1,460 కోట్ల బాండ్‌

న్యూయార్క్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తన ఆస్తుల విలువను ఎక్కువగా చూపి బ్యాంకుల నుంచి వందల కోట్ల డాలర్ల రుణాలను అక్రమంగా పొందారనే కేసు కీలక మలుపు తిరిగింది. ఈ సివిల్‌ మోసం కేసులో ట్రంప్‌ 45.4 కోట్ల డాలర్ల బాండును సమర్పించాలని అటార్నీ జనరల్‌ లెటీషియా జేమ్స్‌ కేసు పెట్టారు. లేదంటే ఆయన ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి బాండ్‌ మొత్తాన్ని తగ్గించాలని న్యూయార్క్‌ అప్పిలేట్‌ కోర్టును ట్రంప్‌ అభ్యర్థించగా, కోర్టు దాన్ని 17.5 కోట్ల డాలర్లకు తగ్గించింది. 10 రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆస్తుల జప్తు తప్పదని హెచ్చరించింది. దాంతో ట్రంప్‌ సోమవారం నాడు ఆ బాండ్‌ సమర్పించారు. ఒకవేళ కేసులో ట్రంప్‌ ఓడిపోతే మొత్తం 45.4 కోట్ల డాలర్లను రోజువారీ వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది. ట్రంపే నెగ్గితే ఆయన ఎలాంటి మొత్తాన్నీ చెల్లించనక్కర్లేదు. ఇప్పుడు కట్టిన మొత్తం తిరిగివచ్చేస్తుంది.


పాకిస్థాన్‌ సెనెట్‌ ఎన్నికల్లో పీఎంఎల్‌-ఎన్‌ కూటమి ఘన విజయం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌) నేతృత్వంలోని అధికార కూటమి ఆ దేశ సెనెట్‌ (ఎగువ సభ) ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. మొత్తం 48 సీట్ల భర్తీకి ఎన్నికల ప్రక్రియ చేపట్టగా మంగళవారం రాత్రి 19 స్థానాల ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 18 స్థానాలను పీఎంఎల్‌-ఎన్‌, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)లతో కూడిన కూటమి సొంతం చేసుకుంది. మరో స్థానంలోనూ ఈ కూటమి బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. మరో 18 స్థానాల్లో అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 11 స్థానాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మొత్తం 90 మంది ఉన్న సెనెట్‌లో తాజా ఫలితాలతో కలిపి పీఎంఎల్‌-ఎన్‌ బలం 19కి, పీపీపీ బలం 24కి చేరింది. ఇమ్రాన్‌కు చెందిన పీటీఐకి 20 మంది సభ్యులున్నారు.


కాంగో తొలి మహిళా ప్రధానిగా జుడిత్‌

కిన్షాసా (కాంగో): ఆఫ్రికా దేశమైన కాంగోలో తొలిసారిగా మహిళా ప్రధానమంత్రిగా జుడిత్‌ సుమిన్వ నియమితులయ్యారు. గతంలో ఆమె ప్రణాళికా శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు ఫెలిక్స్‌ షిసెకెడి నిర్ణయం తీసుకున్నారు. రువాండా దేశంతో సరిహద్దును పంచుకుంటున్న కాంగో తూర్పు ప్రాంతంలో ఖనిజ సంపద అధికం. దీనికోసం గతకొన్నేళ్లుగా రెండు దేశాల్లో హింస చెలరేగుతూనే ఉంది. ఈ హింస కారణంగా ఇప్పటివరకు 70లక్షల మంది నిరాశ్రయులయ్యారని, ప్రపంచంలోనే తీవ్ర మానవతా సంక్షోభంగా ఇది నిలిచిందని ఐక్యరాజ్య సమితి నివేదిక తెలిపింది. ఈ సమయంలో ప్రధానిగా మహిళా నాయకురాలు బాధ్యతలు చేపట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని