వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తున్న ఆరు జన్యువులు

మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆరు జన్యువులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తాజా పరిశోధన తేల్చింది. భావోద్వేగ స్పందన వంటివాటిలో ఇవి ముఖ్య భూమిక వహిస్తాయని, తద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం, పనితీరు, దార్శనికత వంటివాటిని నిర్ధారిస్తాయని వెల్లడైంది.

Published : 03 Apr 2024 04:37 IST

గుర్తించిన శాస్త్రవేత్తలు

దిల్లీ: మనిషి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఆరు జన్యువులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తాజా పరిశోధన తేల్చింది. భావోద్వేగ స్పందన వంటివాటిలో ఇవి ముఖ్య భూమిక వహిస్తాయని, తద్వారా వ్యక్తుల వ్యక్తిత్వం, పనితీరు, దార్శనికత వంటివాటిని నిర్ధారిస్తాయని వెల్లడైంది. ఏకకణ జీవుల నుంచి ఆధునిక మానవుడి వరకూ.. పరిణామక్రమంలో మార్పులకు లోనుకాకుండా ఈ జన్యువులు చాలా భద్రంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి మీద జీవుల వ్యవహారశైలి నిర్ధారణలో అవి కీలక పాత్ర పోషిస్తున్నట్లు వివరించారు.

పరిశీలనయోగ్యమైన లక్షణాలు, వ్యవహారశైలిగా జన్యువులు మారుతుంటాయి. దీన్ని జన్యు వ్యక్తీకరణగా పిలుస్తారు. ఇది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నది పరిశీలించేందుకు స్పెయిన్‌లోని గ్రెనడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల నేతృత్వంలో అంతర్జాతీయ బృందం పరిశోధన నిర్వహించింది. ఇందులో భాగంగా గత నాలుగు దశాబ్దాల్లో ఫిన్లాండ్‌లోని 459 మందికి సంబంధించి సేకరించిన డేటాను కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో విశ్లేషించారు. ఆయా వ్యక్తుల ఆరోగ్యం, శారీరక స్థితి, జీవనశైలితో పాటు వ్యక్తిత్వంతో ముడిపడిన అలవాట్లు, భావోద్వేగ స్పందన, లక్ష్యాలు, విలువలు వంటి వివరాలను సేకరించారు. వ్యక్తిత్వం ఆధారంగా జన్యువుల వ్యక్తీకరణ, సమూహంగా ఏర్పడటం వంటివి జరుగుతున్నట్లు ఇందులో గుర్తించారు. మెదడులోని నిర్దిష్ట ప్రాంతాల్లో 4వేల జన్యువుల వ్యక్తీకరణతో కూడిన నెట్‌వర్క్‌ను వారు గమనించారు. వారసత్వంగా మానవ వ్యక్తిత్వం సంక్రమించడానికి వీటిలో కొన్ని కారణమవుతున్నట్లు ఇప్పటికే వెల్లడైంది. ఇవి కొన్ని సమూహాలుగా ఏర్పడుతున్నాయని, తద్వారా పలు మాడ్యూళ్లుగా రూపాంతరం చెందుతున్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇవి జన్యువ్యక్తీకరణను నియంత్రిస్తున్నాయని పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తి పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు అయ్యేలా చేస్తున్నాయని గుర్తించారు. ఈ మాడ్యూళ్లు సులువుగా ఆన్‌, ఆఫ్‌ అవుతున్నాయని, తద్వారా మనం రోజువారీ ఎదుర్కొనే సవాళ్లకు అనుగుణంగా సర్దుబాటు చేసుకోవడానికి వీలవుతుందని పరిశోధకులు వివరించారు. భావోద్వేగాలు, ఆ మాడ్యూళ్ల కట్టడి బాధ్యతను ఆరు జన్యువులతో తయారైన ఒక నియంత్రణ కేంద్రం చూస్తోందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని