ప్రతీకారం తప్పదన్న ఇరాన్‌

సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై దాడి- ఇజ్రాయెల్‌ పనేనని ఇరాన్‌ ఆరోపించింది. ఎఫ్‌-35 యుద్ధ విమానాలతో దీనికి పాల్పడినట్లు పేర్కొంది.

Updated : 03 Apr 2024 06:37 IST

ఇజ్రాయెల్‌ దాడిలో కమాండర్ల మృతిపై ఆగ్రహం
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తత

టెహ్రాన్‌: సిరియా రాజధాని డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై దాడి- ఇజ్రాయెల్‌ పనేనని ఇరాన్‌ ఆరోపించింది. ఎఫ్‌-35 యుద్ధ విమానాలతో దీనికి పాల్పడినట్లు పేర్కొంది. ఈ నేరానికి వారు పశ్చాత్తాపపడేలా చేస్తామని ఇరాన్‌ సర్వోన్నత నేత అయతుల్లా అలీ ఖొమేనీ హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ దాడి అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని, ప్రతీకార ప్రతిస్పందన తప్పదని డమాస్కస్‌లోని ఇరాన్‌ రాయబారి హుస్సేన్‌ అక్బరీ హెచ్చరించారు. ఒక అధికారిక భవనంపై ఇజ్రాయెల్‌ దాడి చేయడం బహుశా ఇదే మొదటిసారని పేర్కొన్నారు. ప్రతీకార దాడి ఎప్పుడు? ఎలా? ఎంత తీవ్రతతో చేపట్టాలనేది త్వరలో నిర్ణయిస్తామని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి నాజిర్‌ కనానీ హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఐరాస భద్రతామండలిని సమావేశపరచాలని ఇరాన్‌ డిమాండ్‌ చేసింది.

సోమవారంనాటి దాడిలో మొత్తం ఎనిమిదిమంది మృతి చెందినట్లు ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌ ధ్రువీకరించింది. సీనియర్‌ కమాండర్లు- మొహమ్మద్‌ రెజా జహేదీ, మొహమ్మద్‌ హదీ రహీమీ కూడా మృతుల్లో ఉన్నట్లు వెల్లడించింది. జహేదీ ఇరాన్‌కు సైనిక సలహాదారుగా వ్యవహరిస్తుండగా, ఖుద్స్‌ దళాలకు సమన్వయకర్తగా రహీమీ పనిచేస్తున్నారు. దాడిపై ఇజ్రాయెల్‌ ఆచితూచి స్పందించింది. ధ్వంసమైన భవనం రాయబార కార్యాలయం కాదని, అది ఖుద్స్‌ దళాలకు కేంద్రంగా ఉందని సైనిక అధికార ప్రతినిధి డేనియల్‌ హగారీ అన్నారు. దాడిని సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్‌ ఖండించాయి. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో వెంటనే కాల్పుల విరమణకు ఐరాసలో కొత్తగా తీర్మానాన్ని ఫ్రాన్స్‌ ప్రతిపాదించింది. యుద్ధ విరమణకు ప్రత్యామ్నాయ మార్గాలపై అమెరికా, ఇజ్రాయెల్‌ ఉన్నత వర్గాలు రెండున్నర గంటలసేపు వర్చువల్‌గా చర్చించుకున్నాయి.

దాడిలో ఏడుగురి మృతి.. ఆహార సాయం నిలిపివేత

యుద్ధం కారణంగా ఆకలితో అల్లాడుతోన్న గాజావాసుల పాలిట ఇజ్రాయెల్‌ దుందుడుకు చర్య శాపంగా మారింది. ఆ దేశం జరిపిన గగనతల దాడిలో ‘వరల్డ్‌ సెంట్రల్‌ కిచెన్‌’ (డబ్ల్యూసీకే) స్వచ్ఛంద సంస్థకు చెందిన ఆరుగురు విదేశీ సహాయకులు, భారత సంతతికి చెందిన పాలస్తీనా డ్రైవర్‌ ఒకరు ప్రాణాలు కోల్పోయారు. గాజాకు సముద్ర మార్గం ద్వారా వేల టన్నుల ఆహారాన్ని చేరవేస్తోన్న ఈ సంస్థ.. తాజా పరిణామంతో తక్షణం తమ సహాయ కార్యకలాపాలను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఘటనపై ఇజ్రాయెల్‌ తీవ్ర విచారం వ్యక్తంచేసింది. స్వతంత్ర దర్యాప్తు చేపడతామని తెలిపింది. ఇది ఉద్దేశపూర్వక దాడి కాదని ప్రధాని నెతన్యాహు చెప్పారు. మృతుల్లో ముగ్గురు బ్రిటన్‌వాసులతోపాటు ఆస్ట్రేలియా, పోలండ్‌, అమెరికా- కెనడాకు చెందిన వారున్నారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దాడిపై ఇజ్రాయెల్‌ నుంచి వివరణ కోరినట్లు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ చెప్పారు. దాదాపు 400 టన్నుల సామగ్రితో గాజా తీరానికి చేరుకున్న మూడు నౌకలు వెనక్కి వచ్చేస్తున్నట్లు సైప్రస్‌ అధికారులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని