తైవాన్‌ను కుదిపేసిన భూకంపం

భారీ భూకంపం తైవాన్‌ను బుధవారం కుదిపేసింది. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం వ్యాప్తంగా పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి.

Published : 04 Apr 2024 05:08 IST

9 మంది మృత్యువాత
1011 మందికి గాయాలు

హువాలీన్‌: భారీ భూకంపం తైవాన్‌ను బుధవారం కుదిపేసింది. ప్రకంపనల తీవ్రతకు ఆ ద్వీపం వ్యాప్తంగా పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. వంతెనలు కొన్ని సెకన్లపాటు అటూఇటూ ఊగాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రకృతి విపత్తు ధాటికి తైవాన్‌ వ్యాప్తంగా తొమ్మిది మంది మృత్యువాతపడ్డారు. 1,011 మంది గాయపడ్డారు. ఒక దశలో సునామీ హెచ్చరికలు కూడా జారీ అయినా.. తర్వాత వాటిని ఉపసంహరించారు. గత పాతికేళ్లలో తైవాన్‌ను వణికించిన అత్యంత భారీ భూకంపం ఇదేనని తెలుస్తోంది. తూర్పు తీరంలోని హువాలీన్‌ కౌంటీకి 18 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి దాదాపు 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దాని తీవ్రత రిక్టరు స్కేలుపై 7.2గా నమోదైందని తైవాన్‌ భూకంప పర్యవేక్షణ సంస్థ తెలిపింది. అమెరికా జియోలాజికల్‌ సర్వే మాత్రం 7.4గా పేర్కొంది. తాజా విపత్తులో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబసభ్యులకు భారత ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా సంతాపం తెలిపారు.

భూకంపాల ముప్పు ఎక్కువగా ఉండే పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ ప్రాంతంలో తైవాన్‌ ఉంది. అక్కడి ప్రజలు ఈ ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉంటుంటారు. అయితే బుధవారం స్వల్ప ప్రకంపనలు వస్తాయని అధికారులు అంచనా వేయగా, ఉదయం 7:58 నిమిషాలకు చాలా ఎక్కువ తీవ్రతతో భూకంపం సంభవించింది. దాని ధాటికి హువాలీన్‌ కౌంటీలో చాలా భవనాలు నేలకూలాయి. గ్రౌండ్‌ ఫ్లోర్లు కూలిపోవడంతో కొన్ని బహుళ అంతస్తుల భవనాలు పక్కకు ఒరిగాయి.

ప్రజలు భయాందోళనలతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కూలిన భవనాల శిథిలాల నుంచి పలువురిని స్థానికులు, సహాయక సిబ్బంది బయటకు తీస్తుండటం చాలాచోట్ల కనిపించింది. హువాలీన్‌కు 150కిపైగా కిలోమీటర్ల దూరంలోని తైపీ (తైవాన్‌ రాజధాని)లో పాత భవనాల నుంచి టైల్స్‌ ఊడిపోయాయి. అనేక పాఠశాలల నుంచి విద్యార్థులను మైదానాలకు తరలించారు. రైలు సేవలు నిలిచిపోయాయి. 25 చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. 35 రహదారులు దెబ్బతిన్నాయి. దీంతో ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ స్తంభించింది. రెండో ప్రపంచ యుద్ధం కంటే ముందు నిర్మించిన జాతీయ అసెంబ్లీ భవనం, తావోయువాన్‌లోని ప్రధాన విమానాశ్రయం కొంత దెబ్బతిన్నాయి. ఒక క్వారీలో 64 మంది, మరో క్వారీలో ఆరుగురు చిక్కుకొని ఉన్నారు. అయితే వారంతా సురక్షితంగానే ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఫోన్‌ నెట్‌వర్కులు పనిచేయకపోవడంతో.. హువాలీన్‌లోని తరోకో నేషనల్‌ పార్కులో మినీబస్సుల్లోని 50 మంది జాడ తెలియరాలేదని అధికారులు తెలిపారు. యొనగుని తీరంలో 30 సెంటీమీటర్ల ఎత్తులో సునామీ అలలు నమోదయ్యాయని జపాన్‌ వాతావరణ సంస్థ వెల్లడించింది. అయితే మధ్యాహ్నంకల్లా సునామీ హెచ్చరికలను ఉపసంహరించారు. మరోవైపు- చైనాలో షాంఘై సహా ఆగ్నేయ తీరంలోని పలు ప్రావిన్సుల్లోనూ భూమి కంపించింది. 1999 సెప్టెంబరు 21న తైవాన్‌ను భారీ భూకంపం (7.7 తీవ్రత) వణికించింది. నాటి విపత్తు ధాటికి 2,400 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు లక్ష మంది గాయపడ్డారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని