అక్షయపాత్ర కృషి గర్వకారణం: మోదీ

‘‘అక్షయపాత్ర కృషి ఎంతో గర్వకారణం, ఇది ఆనందదాయక క్షణం. 2019 ఫిబ్రవరిలో బృందావన్‌ వద్ద 300వ కోట్ల భోజనాన్ని నా చేతుల మీదుగా వడ్డించాను.

Updated : 04 Apr 2024 05:43 IST

400 కోట్లమందికి అన్నదానంపై ఐరాసలో ప్రత్యేక వేడుక

ఐక్యరాజ్య సమితి: ‘‘అక్షయపాత్ర కృషి ఎంతో గర్వకారణం, ఇది ఆనందదాయక క్షణం. 2019 ఫిబ్రవరిలో బృందావన్‌ వద్ద 300వ కోట్ల భోజనాన్ని నా చేతుల మీదుగా వడ్డించాను. కోట్లాది బాలలకు ఆహారాన్ని అందించడం ద్వారా అక్షయపాత్ర భావితరాలకు పోషణను సమకూరుస్తోంది’’ అని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రముఖ స్వచ్ఛందసంస్థ ‘అక్షయపాత్ర ఫౌండేషన్‌’ 400వ కోట్ల భోజనాన్ని వడ్డించిన సందర్భంగా మంగళవారం ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ‘ఆహార భద్రత, సుస్థిరాభివృద్ధి సాధనలో భారత్‌ విజయాలు’ అనే శీర్షికన దీన్ని నిర్వహించారు. 400వ కోట్ల భోజనాన్ని సమితి ప్రధాన కార్యాలయంలో వడ్డించిన అక్షయపాత్ర ఫౌండేషన్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీ పంపిన సందేశాన్ని సమితిలో భారత శాశ్వత కార్యాలయ ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ చదివి వినిపించారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో నాలుగోదైన ఆకలి నిర్మూలనను సాధించడంలో భారత్‌ కృషికి ఇది నిదర్శనమని కాంబోజ్‌ పేర్కొన్నారు.

సమితి కార్యక్రమంలో జరిగిన ఈ వేడుకకు నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థి, ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి, అక్షయపాత్ర ఫౌండేషన్‌ అధ్యక్షుడు మధు పండిత్‌ దాస హాజరయ్యారు. 400 కోట్ల మందికి భోజనాన్ని వడ్డించడం సాధారణ విషయం కాదని సత్యార్థి కీలకోపన్యాసంలో ప్రశంసించారు. ప్రపంచం 2030 కల్లా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించడంలో విఫలమైతే తన భవిష్యత్తును కోల్పోయినట్లే అన్నారు. భారత ప్రభుత్వం, అక్షయపాత్ర కలిసి భవిష్యత్తుపై ఆశ కోల్పోవద్దని మానవాళికి చాటుతున్నాయన్నారు. తమ తమ దేశాల్లోని పేదపిల్లల కోసం అక్షయపాత్ర వంటి కార్యక్రమాలను చేపట్టాలని నారాయణమూర్తి సమితి సభ్యులను కోరారు. ఇది ప్రభుత్వ - ప్రైవేటు భాగస్వామ్య కార్యక్రమమనీ, శుభ్రమైన ఆహారాన్ని వేగంగా వేడిగా పంపిణీ చేయడానికి అక్షయపాత్ర అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోందని చెప్పారు.

భారీఎత్తున వంట, ఆహార పంపిణీకి తాము ఉపయోగిస్తున్న అధునాతన పరిజ్ఞానాన్నీ, అనుభవాన్ని ప్రపంచంలోని ఇతర దేశాలు, సంస్థలతో పంచుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు అక్షయపాత్ర చైర్మన్‌ మధుపండిత్‌ దాస చెప్పారు. తుర్కియే భూకంపంలోనూ, ఉక్రెయిన్‌ యుద్ధంలోనూ ఆర్తులకు అన్నపానాదులు అందిస్తున్నామని వివరించారు. భారత్‌లో అక్షయపాత్ర 72 వంటశాలలను నిర్వహిస్తోందని, గత 24 ఏళ్లలో 24,000 పాఠశాలల్లోని 21 లక్షల మందికి రోజూ భోజనం అందిస్తున్నట్లు దాస చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని