నెతన్యాహు చేస్తున్నది తప్పు

గత కొంతకాలంగా గాజాలో ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతున్న జో బైడెన్‌.. మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated : 11 Apr 2024 05:42 IST

ఆయన వైఖరిని ఆమోదించను
కాల్పుల విరమణకు అంగీకరించాలి
ఇజ్రాయెల్‌కు స్పష్టంచేసిన బైడెన్‌

టెల్‌ అవీవ్‌: గత కొంతకాలంగా గాజాలో ఇజ్రాయెల్‌ అనుసరిస్తున్న వైఖరిని తప్పుపడుతున్న జో బైడెన్‌.. మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తప్పు చేస్తున్నారని విమర్శించారు. ‘‘గాజాలో నెతన్యాహు తప్పు చేస్తున్నారు. ఆయన వైఖరిని అంగీకరించను. ఆరు లేదా ఎనిమిది వారాలపాటు తక్షణమే కాల్పుల విరమణ ప్రకటించాలని నేను ఇజ్రాయెలీలను కోరుతున్నాను. ఈ సమయంలో శరణార్థులకు ఆహారం, ఔషధాలను సరఫరా చేయొచ్చు’’ అని  ఓ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గత వారం జరిగిన డ్రోన్‌ దాడిలో వరల్డ్‌ కిచెన్‌ సెంటర్‌ (డబ్ల్యూకేసీ) స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తున్న ఏడుగురు మరణించారు. ఈ ఘటనపై అగ్రరాజ్యం తీవ్ర అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసింది. జోర్డాన్‌, సౌదీ, ఈజిప్ట్‌ దేశాలు కూడా సహాయం, ఆహారం పంపేలా నిత్యం వారితో సంప్రదింపులు జరుపుతున్నట్లు బైడెన్‌ తెలిపారు. వారు కూడా దీనికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గాజాలోని ప్రజలకు ఔషధాలు, ఆహార సరఫరాలో ఎటువంటి రాజీ ఉండదని చెప్పారు. మరోవైపు శ్వేతసౌధం స్పందిస్తూ సంధి కోసం ఇజ్రాయెల్‌ కొన్ని చర్యలు తీసుకొందని వెల్లడించింది. కానీ, హమాస్‌ వైపు స్పందన మాత్రం అంత ప్రోత్సాహకరంగా లేదని పేర్కొంది. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం దీనిపై స్పందిస్తూ అమెరికా, ఐరాస డిమాండ్‌ చేసిన విధంగానే గాజాలోకి సరఫరాలను పెంచామని వివరించింది. తాము వీటికి ఎటువంటి ఆటంకాలను సృష్టించడం లేదని తెలిపింది. సోమవారం 468 ట్రక్కులు, మంగళవారం 419 ట్రక్కుల సామగ్రిని తరలించినట్లు చెప్పింది. యుద్ధం మొదలైన నాటికి ఇదే అత్యధికమని వెల్లడించింది.

‘హెజ్‌బొల్లా’పై ఇజ్రాయెల్‌ దాడి

సిరియా కేంద్రంగా పనిచేస్తున్న లెబనాన్‌కు చెందిన హెజ్‌బొల్లా స్థావరాలపై దాడులు చేసినట్లు ఇజ్రాయెల్‌  ప్రకటించింది. బుధవారం ఉదయం జరిపిన ఈ వైమానిక దాడుల్లో కీలక స్థావరాలు, సైనిక మౌలికవసతులను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) ‘ఎక్స్‌’ వేదికగా విడుదల చేసింది. సిరియా భూభాగంపై జరుగుతున్న అన్ని కార్యకలాపాలకు ఆ దేశమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఐడీఎఫ్‌ తెలిపింది. హెజ్‌బొల్లా బలోపేతం కోసం మద్దతు ఇచ్చే ప్రయత్నాలను ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పింది. పరోక్షంగా సిరియా గడ్డ నుంచి హెజ్‌బొల్లా కార్యకలాపాలకు అనుమతినివ్వొద్దని హెచ్చరించింది. గాజాలో హమాస్‌పై యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా పలుసార్లు విరుచుకుపడింది. దీంతో ఐడీఎఫ్‌ ఆ మిలిటెంట్‌ గ్రూప్‌పైనా దాడులు చేస్తోంది. మరోవైపు ఇజ్రాయెల్‌ సోమవారం జరిపిన దాడిలో హెబ్‌బొల్లాలోని ప్రధాన విభాగమైన రాడ్వాన్‌ ఫోర్సెస్‌ కమాండర్‌ అలీ అహ్మద్‌ హుస్సేన్‌ మృతిచెందాడు.


ఇజ్రాయెల్‌ను శిక్షించడం ఖాయం: ఖమేనీ

సిరియాలోని తమ దౌత్యకార్యాలయంపై దాడి చేసిన వారిని వదలిపెట్టబోమని ఇరాన్‌ సుప్రీం నేత అయాతుల్లా అలీ ఖమేనీ పునరుద్ఘాటించారు. గత వారం జరిగిన ఈ దాడిలో ఇరాన్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు జనరళ్లు మృతి చెందిన సంగతి తెలిసిందే. దీని వెనక ఇజ్రాయెల్‌ హస్తం ఉందని ఇరాన్‌ పేర్కొంటోంది. అయితే తాము బాధ్యులమని అధికారికంగా ఇజ్రాయెల్‌ ప్రకటించలేదు. ‘‘మా రాయబార కార్యాలయంపై దాడి చేశారంటే మా దేశంపై చేసినట్లే. దుష్టపాలనను శిక్షిస్తాం’’ అని ఖమేనీ తెలిపారు. అమెరికా, బ్రిటన్‌పై కూడా ధ్వజమెత్తారు. ‘‘ఈ సంక్షోభం తలెత్తకుండా ఇజ్రాయెల్‌ను అమెరికా, బ్రిటన్‌లు అడ్డుకుంటాయని ఊహించాం. పాశ్చాత్య ప్రభుత్వాలు తమ విధుల్ని సరిగా నిర్వర్తించలేదు’’ అని అన్నారు. ఖమేనీ ప్రకటనపై ఇజ్రాయెల్‌ స్పందించింది. ఇరాన్‌ దాడిచేస్తే తామూ ఆ దేశంపై నేరుగా విరుచుకుపడతామని స్పష్టంచేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని