సంక్షిప్త వార్తలు (3)

తైవాన్‌కు ఆయుధాలు సమకూరుస్తున్నారని ఆరోపిస్తూ రెండు అమెరికా రక్షణ కంపెనీలపై  చైనా గురువారం ఆంక్షలు విధించింది.

Updated : 12 Apr 2024 05:58 IST

రెండు అమెరికా రక్షణ కంపెనీలపై చైనా ఆంక్షలు

బీజింగ్‌: తైవాన్‌కు ఆయుధాలు సమకూరుస్తున్నారని ఆరోపిస్తూ రెండు అమెరికా రక్షణ కంపెనీలపై  చైనా గురువారం ఆంక్షలు విధించింది. జనరల్‌ అటామిక్స్‌ ఎరోనాటికల్‌ సిస్టమ్స్‌, జనరల్‌ డైనమిక్‌ ల్యాండ్‌ సిస్టమ్స్‌ అనే రెండు అమెరికా కంపెనీలకు చైనాలో ఉన్న ఆస్తులపై ఆంక్షలు విధించామని తెలిపింది. ‘‘నిరంతరంగా తైవాన్‌కు కొనసాగుతున్న అమెరికా ఆయుధాల సరఫరా ‘ఒక చైనా’ సూత్రాన్ని, మూడు చైనా-అమెరికాల ఉమ్మడి నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘిస్తున్నాయి. దేశ అంతర్గత వ్యవహారాలº్ల జోక్యం చేసుకోవడం మా సార్వభౌమ అధికారాన్ని, ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీయడమే’ అని బీజింగ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది. తైవాన్‌ ద్వీపం చైనాలో అంతర్భాగమేనని మరోసారి నొక్కి చెప్పింది. అవసరమైతే ద్వీపాన్ని బలవంతంగానైనా సొంతం చేసుకుంటామని వ్యాఖ్యానించింది. చైనా ఆంక్షలపై రెండు సంస్థలు వెంటనే స్పందించలేదు. మరోవైపు తైవాన్‌ చుట్టూ 14 యుద్ధనౌకలు, ఆరు నౌకలను బుధ, గురువారాల్లో మోహరింపజేసి చైనా కవ్వింపు చర్యలకు పాల్పడింది. తైవాన్‌ గగనతల రక్షణ జోన్‌లోకి ఆరు విమానాలను పంపి ద్వీప రక్షణ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించింది.


వాషింగ్టన్‌లో దుండగుల కాల్పులు
 ఒకరి మృతి, అయిదుగురికి గాయాలు

వాషింగ్టన్‌: అమెరికాలో తుపాకీ సంస్కృతికి అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా ఆ దేశ రాజధాని వాషింగ్టన్‌లో గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందారు. మరో అయిదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో 9, 12 ఏళ్ల పిల్లలతో పాటు ఓ మహిళా కూడా ఉన్నారు. బుధవారం సాయంత్రం కార్వర్‌ లాంగ్‌స్టన్‌ ప్రాంతానికి వాహనంలో వచ్చిన అనుమానితులు వీధిలోని ప్రజలపై ఒక్కసారిగా కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.


లోయలో పడిన బస్సు.. పాక్‌లో 17మంది యాత్రికుల దుర్మరణం

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లో బస్సు లోయలో పడి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముస్లిం యాత్రికుల బృందంతో ఓ బస్సు తట్ట ప్రాంతం నుంచి బయలుదేరింది. వీరంతా ఈదుల్‌ ఫితర్‌ను పురస్కరించుకొని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌ ఖుజ్దార్‌ జిల్లాలోని సూఫీ పుణ్యక్షేత్రమైన షా నూరానీకి వెళుతున్నారు. రాత్రి 8 గంటల సమయంలో వీరు ప్రయాణిస్తున్న బస్సు సింధ్‌-బలూచిస్థాన్‌ ప్రావిన్సుల సరిహద్దు పట్టణ సమీపంలో ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. మలుపు వద్ద వాహనంపై డ్రైవర్‌ నియంత్రణను  కోల్పోవడంతో ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని