అదనపు సైన్యం కోసం ఉక్రెయిన్‌ ఆరాటం

రష్యాతో యుద్ధంలో నానాటికీ క్షీణించిపోతున్న ఉక్రెయిన్‌ సైనిక బలాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన వివాదాస్పద బిల్లును ఉక్రెయిన్‌ పార్లమెంటు గురువారం ఆమోదించింది.

Published : 12 Apr 2024 05:30 IST

వివాదాస్పద సైనిక బిల్లుకు ఆమోదం
5 లక్షల మంది సైనికులు అవసరమని అంచనా

కీవ్‌: రష్యాతో యుద్ధంలో నానాటికీ క్షీణించిపోతున్న ఉక్రెయిన్‌ సైనిక బలాన్ని భర్తీ చేయడానికి ఉద్దేశించిన వివాదాస్పద బిల్లును ఉక్రెయిన్‌ పార్లమెంటు గురువారం ఆమోదించింది. దీని ప్రకారం ఉక్రెయిన్‌లో 18 నుంచి 60 ఏళ్ల వయసువారు తమ వ్యక్తిగత వివరాలను సైన్యం వద్ద నమోదు చేసుకోవాలి. వారిలో అవసరమైనప్పుడు ఎవరెవరిని సైన్యంలోకి తీసుకుని యుద్ధ రంగానికి పంపవచ్చునో నిర్ణయించడం అధికారులకు తేలిక అవుతుంది. ఈ సైనిక సర్వీసు బిల్లు తరిగిపోతున్న సేనా బలాన్ని మళ్లీ భర్తీ చేసుకోవడానికి ఉపకరిస్తుందని ఆశిస్తున్నారు.  రష్యా రెండేళ్ల క్రితం దండెత్తి ఉక్రెయిన్‌లో 25 శాతం భూభాగాన్ని ఆక్రమించింది. తొలి సంవత్సరం రష్యాపై కొన్ని విజయాలు సాధించగలిగిన ఉక్రెయిన్‌ తరవాత ఆయుధాలు, సైనికుల కొరత వల్ల ముందడుగు వేయలేకపోతోంది. అమెరికా, నాటోల నుంచీ సహాయం అంతంతమాత్రంగా ఉంది. ఈ పరిస్థితిలో రష్యాను ఎదుర్కోవాలంటే అదనంగా 5 లక్షల మంది సైనికులు అవసరమవుతారని ఉక్రెయిన్‌ సైన్యం అంచనా. అంతమందిని నిర్బంధంగా సైన్యంలోకి తీసుకోవడం కష్టమని ఆందోళన రేగింది. దీనికి బదులు యుద్ధంలో ముందుండి పోరాడుతున్న సైనికులను నిర్ణీత కాలం తరవాత వెనక్కు పంపి, వెనకనున్న సైనికులను ముందుకు తీసుకురావాలనే ప్రతిపాదన వచ్చింది. దీనివల్ల సైనికులకు విరామం లభించి మళ్లీ పోరాటంలోకి దిగగలుగుతారని అంచనా. తద్వారా తక్కువమంది సైనికులతో పని జరుగుతుందని భావించారు. రష్యాతో పోరుకు నిర్బంధ సైనిక సర్వీసును చాలామంది ఉక్రెయిన్‌ పురుషులు తప్పించుకుంటున్నారు. ఈ పరిస్థితిని మార్చి అదనపు సైనికులను సమకూర్చుకోవడానికి కొత్త బిల్లు తోడ్పడుతుందని ఆశిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని