నాసా రాకెట్ల మిషన్‌కు భారత సంతతి శాస్త్రవేత్త నేతృత్వం

ఇటీవల సూర్యగ్రహణం సందర్భంగా అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా మూడు పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది.

Updated : 12 Apr 2024 05:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల సూర్యగ్రహణం సందర్భంగా అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా మూడు పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. సూర్యగ్రహణం వేళ భూగ్రహంపై సూర్యకాంతి మసకబారినప్పుడు ఎగువ వాతావరణం ఎలా ప్రభావితమవుతుందో అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టింది. ఈ మిషన్‌కు సారథ్యం వహించింది భారత సంతతి శాస్త్రవేత్త కావడం విశేషం. ఆయనే ఆరోహ్‌ బడ్జాత్యా. నాసా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘ఫ్లోరిడాలోని ఎంబ్రీ-రిడిల్‌ ఏరోనాటికల్‌ యూనివర్సిటీలో ఇంజినీరింగ్‌ ఫిజిక్స్‌ విభాగంలో ప్రొఫెసర్‌ ఆరోహ్‌.. ఈ మిషన్‌కు నేతృత్వం వహించారు. ఆయన అదే యూనివర్సిటీలోని స్పేస్‌, ఎట్మాస్పియరిక్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ల్యాబ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు’’ అని నాసా తెలిపింది. వర్జీనియాలోని వాలోప్స్‌ ప్రయోగ కేంద్రం నుంచి ‘ఎట్మాస్పియరిక్‌ పెర్టర్బేషన్స్‌ అరౌండ్‌ ఎక్లిప్స్‌ పాత్‌’ పరిశోధక రాకెట్లను ప్రయోగించారు. గ్రహణానికి 45 నిమిషాల ముందు, గ్రహణం సమయంలో, ఆ తర్వాత 45 నిమిషాలకు వీటిని ప్రయోగించారు. ఆ సమయంలో ఉపగ్రహ కమ్యూనికేషన్‌కు కీలకమైన అయనోస్పియర్‌లోని మార్పులను ఈ రాకెట్లలోని పరికరాలు నమోదు చేశాయి. ఆరోహ్‌ తండ్రి అశోక్‌ కుమార్‌ కెమికల్‌ ఇంజినీర్‌, తల్లి రాజేశ్వరి గృహిణి. ముంబయి, హైదరాబాద్‌, జైపుర్‌, పిలానీ, సోలాపుర్‌ తదితర ప్రాంతాల్లో ఆయన విద్యాభ్యాసం సాగింది. 2001లో అమెరికాకు వెళ్లిన ఆయన.. అక్కడే మాస్టర్స్‌ పూర్తి చేశారు. స్పేస్‌క్రాఫ్ట్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో పీహెచ్‌డీ పొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని