స్థిరాస్తి మహిళా దిగ్గజానికి మరణశిక్ష

వియత్నాంలో స్థిరాస్తి (రియల్‌ ఎస్టేట్‌) రంగంలో మహిళా దిగ్గజ వ్యాపారవేత్తగా పేరుగాంచిన ట్రూంగ్‌ మై లాన్‌(67)కు స్థానిక కోర్టు గురువారం మరణశిక్ష విధించింది.

Published : 12 Apr 2024 05:40 IST

 వియత్నాంలో సంచలన తీర్పు
రూ.లక్ష కోట్ల మోసం కేసులో దోషిగా నిరూపణ

హనోయ్‌: వియత్నాంలో స్థిరాస్తి (రియల్‌ ఎస్టేట్‌) రంగంలో మహిళా దిగ్గజ వ్యాపారవేత్తగా పేరుగాంచిన ట్రూంగ్‌ మై లాన్‌(67)కు స్థానిక కోర్టు గురువారం మరణశిక్ష విధించింది. ‘వాన్‌ థిన్‌ ఫాట్‌’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ ఛైర్మన్‌గా ఉన్న ఆమె సుమారు రూ.లక్ష కోట్ల (12.5 బిలియన్‌ డాలర్లు) మేర బ్యాంకును మోసం చేశారన్న కేసులో దోషిగా తేలారు. ఈ మొత్తం ఆ దేశ జీడీపీలో 3 శాతం కావడం గమనార్హం. దీంతో ఆమెకు అక్కడి న్యాయస్థానం మరణశిక్ష విధిస్తూ తీర్పిచ్చింది. దేశంలో సంపన్న వ్యక్తుల్లో ఒకరిగా నిలిచిన ఆమెపై కోర్టు తీర్పు ఎలా ఉండబోతోందనే విషయంపై వియత్నాం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూసింది.

స్థానిక సైగాన్‌ జాయింట్‌ స్టాక్‌ కమర్షియల్‌ బ్యాంకును లాన్‌ అక్రమంగా తన ఆధీనంలోకి తీసుకుని 2012 నుంచి 2022 వరకూ 2500 రుణాలు తీసుకున్నారు. ఈ కారణంగా బ్యాంకుకు 27 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లింది. ఆమె డ్రైవర్‌ బ్యాంకు ప్రధాన కార్యాలయం నుంచి 4.4 బిలియన్‌ డాలర్ల నగదును లాన్‌ నివాసానికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. 2022లో ఈ కుంభకోణం బయటపడగా అదే ఏడాది అక్టోబరులో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. మరోపక్క 5.2 మిలియన్‌ డాలర్లను లంచంగా తీసుకున్నారన్న ఆరోపణలపై వియత్నాం కేంద్ర బ్యాంకు మాజీ అధికారి డొ థి న్హాన్‌కు జీవితకాల కారాగార శిక్షను న్యాయస్థానం విధించింది. ప్రస్తుతం వియత్నాంలో స్థిరాస్తి వ్యాపారం కుదేలైంది. కొనుగోలుదారులను ఆకర్షించేందుకు పెద్దపెద్ద సంస్థలు భారీ ఎత్తున డిస్కౌంట్లను, బంగారం బహుమతులను అందిస్తామంటూ ప్రకటిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని