ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాలతో పెరుగుతున్న పక్షవాత మరణాలు

వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతల్లో వస్తున్న వైరుధ్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షవాత బాధితులు ఎక్కువగా చనిపోతున్నారని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు.

Published : 12 Apr 2024 05:37 IST

దిల్లీ: వాతావరణ మార్పులతో ఉష్ణోగ్రతల్లో వస్తున్న వైరుధ్యాల వల్ల ప్రపంచవ్యాప్తంగా పక్షవాత బాధితులు ఎక్కువగా చనిపోతున్నారని చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. మూడు దశాబ్దాల అంతర్జాతీయ డేటాపై తాజాగా జరిగిన విశ్లేషణలో ఈ మేరకు వెల్లడైందని వారు తెలిపారు. ఉష్ణోగ్రతల్లో నాటకీయ స్థాయిలో చోటుచేసుకుంటున్న మార్పులు మానవ ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతాయని పరిశోధనకు నాయకత్వం వహించిన క్వాన్‌ చెంగ్‌ తెలిపారు. అవి ఆమోదయోగ్య స్థాయికి మించి పెరిగినా, తగ్గినా పక్షవాత బాధితులకు ఇబ్బందేనని చెప్పారు. వీరి అధ్యయనంలో వెల్లడైన అంశాల ప్రకారం..

  • 2019లో భరింపశక్యం కాని ఉష్ణోగ్రతలతో 5.2 లక్షల మంది పక్షవాత బాధితులు మరణించారు. వీరిలో 4.7 లక్షల మంది.. ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్లే బలయ్యారు.
  • 1990తో పోలిస్తే.. అధిక ఉష్ణోగ్రతల వల్ల సంభవించిన పక్షవాత మరణాలు పెరిగాయి.
  • అధిక ఉష్ణోగ్రతలతో పక్షవాత బాధితులపై పడుతున్న భారం బాగా పెరిగింది. సామాజిక-జనాభా సూచీ తక్కువగా ఉన్న ఆఫ్రికా వంటి ప్రాంతాల్లో దీని ప్రభావం ఎక్కువ.  
  •  2019లో భారత్‌లో భరింపశక్యం కాని ఉష్ణోగ్రతల వల్ల 33వేల మంది చనిపోయారు. అందులో 55 శాతం మరణాలకు తీవ్ర వేడే కారణం. ఉష్ణోగ్రతలు పడిపోవడంవల్ల 45 శాతం మంది మృత్యువాత పడ్డారు.  
  •  జనాభాలో వృద్ధుల సంఖ్య పెరగడం కూడా ఈ తరహా మరణాలు అధికం కావడానికి కారణమవుతోంది.
  •  ఉష్ణోగ్రతల్లో వైరుధ్యాల వల్ల చనిపోతున్న పక్షవాత బాధితుల్లో పురుషులే ఎక్కువ. సగటున లక్ష మందిలో 7.7 మంది మగవారు ఇలా బలవుతున్నారు. మహిళల్లో ఇది 5.9గానే ఉంది.
  •  ప్రాంతీయంగా చూసినప్పుడు మధ్య ఆసియాలో ఈ తరహా మరణాలు ఎక్కువగా ఉంటున్నాయి. అక్కడ సగటున లక్ష మందిలో 18 మంది ఇలా ప్రాణాలు కోల్పోతున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని