ఉద్రిక్తంగా పశ్చిమాసియా

పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయనుందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.

Published : 12 Apr 2024 05:39 IST

ఏ క్షణమైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి?
 టెహ్రాన్‌కు విమాన సర్వీసులు నిలిపివేసిన లుఫ్తాన్సా

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌: పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయనుందన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇజ్రాయెల్‌ను శిక్షించే సమయం ఆసన్నమైందంటూ గురువారం ఇరాన్‌ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ ఐఆర్‌ఎన్‌ఏ పేర్కొంది. దాడి ఎలా చేయాలన్న విషయంలోనే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. డమాస్కస్‌లోని తమ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పటి నుంచి ఇరాన్‌ పగతో రగిలిపోతోంది. ఆ దాడిలో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన ఏడుగురు జనరళ్లు మృతి చెందారు. అప్పటి నుంచి ఆ దేశ సుప్రీం అధినేత అయతుల్లా అలీ ఖొమేనీ సహా సైనిక జనరళ్లు కూడా ఇజ్రాయెల్‌ను శిక్షిస్తామని బహిరంగ ప్రకటనలిస్తూనే ఉన్నారు. అయితే ఇజ్రాయల్‌పై నేరుగా ఇరాన్‌ దాడి చేయకపోవచ్చని, లెబనాన్‌ లేదా సిరియా నుంచి తన మద్దతుదారులైన హెజ్‌బొల్లా, ఇతర మిలిటెంట్‌ సంస్థలతో దాడులు చేయించొచ్చని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

అండగా నిలిస్తే మీపైనా దాడి

ఇజ్రాయెల్‌పై దాడి చేస్తే అమెరికా కూడా రంగంలోకి దిగుతుందని ఇరాన్‌ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టెల్‌ అవీవ్‌కు అండగా నిలిస్తే పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలపై దాడి చేయడానికి వెనుకాడబోమన్న సందేశాన్ని గురువారం అగ్రరాజ్యానికి ఇరాన్‌ పంపినట్లు తెలుస్తోంది. దీంతో ఇజ్రాయెల్‌ను అమెరికా అప్రమత్తం చేసింది. అంతేకాదు..అమెరికా సెంట్రల్‌ కమాండ్‌కు చెందిన జనరల్‌ మైకెల్‌ ఎరిక్‌ కొరిల్లాను ఇజ్రాయెల్‌కు పంపింది. టెల్‌ అవీవ్‌కు చేరుకున్న ఆయన భద్రతా పరిస్థితిని సమీక్షించారు. ఇజ్రాయెల్‌ కూడా తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి సిద్ధమని ప్రకటించింది. ఇరాన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడితే ఎదురుదాడి తప్పదని ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు.

ఇజ్రాయెల్‌కు అండగా ఉంటాం: బైడెన్‌

ఇజ్రాయెల్‌కు తాము పూర్తిస్థాయిలో అండగా నిలుస్తామని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ స్పష్టం చేశారు. ఆ దేశ రక్షణకు, భద్రతకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని అన్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా ఇరాన్‌ బెదిరింపులను తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు. అమెరికన్లతో పాటు ఇజ్రాయెల్‌కు తామూ అండగా నిలుస్తామని పేర్కొన్నారు. ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో లుఫ్తాన్సా విమాన సంస్థ టెహ్రాన్‌కు విమాన సర్వీసులను నిలిపివేసింది. ఆస్ట్రియన్‌ ఎయిర్‌లైన్స్‌ మాత్రం తాము సర్వీసులను నిలిపివేయడం లేదని.. అయితే విమాన సమయాలను మారుస్తున్నామని తెలిపింది. పశ్చిమాసియాకు ప్రయాణించొద్దని తమ పౌరులను రష్యా విదేశాంగశాఖ హెచ్చరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని