ఏ క్షణంలోనైనా..!

ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయనుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్‌ అవీవ్‌పై విరుచుకుపడేందుకు టెహ్రాన్‌ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం కలకలం రేపుతోంది.

Published : 13 Apr 2024 05:52 IST

ఇజ్రాయెల్‌పై 100 డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో దాడికి ఇరాన్‌ సమాయత్తం
ఎదుర్కొనేందుకు సిద్ధమైన నెతన్యాహు సేన
పశ్చిమాసియాలో క్షణక్షణం భయాందోళనలు

టెహ్రాన్‌/టెల్‌ అవీవ్‌: ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయనుందన్న సంకేతాలు పశ్చిమాసియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రానున్న 24 నుంచి 48 గంటల్లోపు దాదాపు 100కు పైగా డ్రోన్లు, 150కు పైగా క్షిపణులతో టెల్‌ అవీవ్‌పై విరుచుకుపడేందుకు టెహ్రాన్‌ సమాయత్తమైందన్న అమెరికా నిఘా వర్గాల సమాచారం కలకలం రేపుతోంది. మరోవైపు ఇజ్రాయెల్‌ కూడా తాము ఎలాంటి దాడినైనా ఎదుర్కొవడానికి పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ప్రధాని నెతన్యాహుకు అగ్రరాజ్యం అమెరికా సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. అమెరికా, బ్రిటన్‌, భారత్‌, ఫ్రాన్స్‌, చైనా తదితర దేశాలు ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని తమ పౌరులకు హెచ్చరికలు జారీ చేశాయి. కుటుంబాలతో సహా ఫ్రెంచ్‌ దౌత్యవేత్తలు తక్షణం టెహ్రాన్‌ను వీడాలని ఫ్రాన్స్‌ ఆదేశించింది. భారత పౌరులెవ్వరూ ఇజ్రాయెల్‌, ఇరాన్‌కు ప్రయాణాలు చేయొద్దని విదేశీ వ్యవహారాల శాఖ ప్రకటన విడుదల చేసింది. శనివారం వరకు టెహ్రాన్‌కు తమ విమాన సర్వీసులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జర్మనీకి చెందిన లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్‌ తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ గడువును గురువారానికి పొడిగించింది. రెండు వారాల క్రితం సిరియాలోని ఇరాన్‌ రాయబారి కార్యాలయంపై దాడిలో రివల్యూషనరీ గార్డ్స్‌ దళానికి చెందిన కీలక సైనికాధికారులు మృతి చెందినప్పటి నుంచి ఇరాన్‌ ఆగ్రహంతో రగులుతోంది. ఇజ్రాయల్‌పై దాడి తప్పదని హెచ్చరిస్తోంది. అయితే దాడిపై ఇంకా ఇరాన్‌ తుది నిర్ణయం తీసుకోలేదన్న వార్తలూ వెలువడుతున్నాయి. మరోవైపు ఇరాన్‌ను ఎదుర్కొవడానికి ఇజ్రాయెల్‌, అమెరికా సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే క్షిపణి విధ్వంసక యుద్ధనౌకలను ఇజ్రాయెల్‌కు సమీపంలోకి అగ్రరాజ్యం పంపింది. ఇరాన్‌ హెచ్చరికల నేపథ్యంలో టెల్‌ అవీవ్‌ చేరుకున్న అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ జనరల్‌ మైకెల్‌ ఎరిక్‌ కొరిల్లా శుక్రవారం ఇజ్రాయెల్‌ యుద్ధ సన్నద్ధతను సమీక్షించారు. ఆ దేశ రక్షణ మంత్రి యోయావ్‌ గాలాంట్‌తో కలిసి హెట్జోర్‌ వైమానిక స్థావరాన్ని సందర్శించారు. ‘‘ఇజ్రాయెల్‌, అమెరికాలను ఓడించగలమని మా శత్రువులు భావిస్తున్నారు.కానీ జరిగేది అందుకు వ్యతిరేకం. వారు మమ్మల్ని మరింత దగ్గరకు చేరుస్తున్నారు. మా బంధాన్ని బలోపేతం చేస్తున్నారు’’ అని ఎరిక్‌తో సమావేశానంతరం యోయావ్‌ గలాంట్‌ వ్యాఖ్యానించారు.

మేం సహకరించం

ఇజ్రాయెల్‌కు అండగా ఇరాన్‌పై అమెరికా దాడి చేస్తే తాము సహకరించబోమని కొన్ని అరబ్‌ దేశాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఖతార్‌, కువైట్‌ ఈ విషయాన్ని కరాఖండిగా అగ్రరాజ్యానికి తేల్చి చెప్పాయి. ఇరాన్‌పై దాడికి తమ దేశ గగనతలాన్ని గానీ.. స్థావరాలను గానీ.. వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వబోమని స్పష్టంచేశాయి. సౌదీ అరేబియా సహా మిగతా అరబ్‌ దేశాలూ అదే బాట పట్టే అవకాశం ఉంది.


ఇజ్రాయెల్‌, ఇరాన్‌కు వెళ్లొద్దు
భారత పౌరులకు విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరిక

దిల్లీ: పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఉత్తర్వులు జారీ చేసేవరకు ఇరాన్‌, ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు చేయొద్దని భారత పౌరులను శుక్రవారం విదేశీ వ్యవహారాల శాఖ హెచ్చరించింది. ఇరాన్‌, ఇజ్రాయెల్‌లోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, రాయబార కార్యాలయాన్ని సంప్రదించి, తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకోవాలని సూచించింది. భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, సాధ్యమైనంత మేరకు ప్రయాణాలను నియంత్రించుకోవాలని పేర్కొంది. ప్రస్తుతం ఇరాన్‌లో 4 వేల మంది, ఇజ్రాయెల్‌లో దాదాపు 18,500 మంది భారతీయులు నివసిస్తున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్‌ నిర్మాణ రంగంలో పనిచేసేందుకు భారత్‌ నుంచి వెళుతున్న కార్మికులకు అనుమతులు లభించవని తెలుస్తోంది. ఏప్రిల్‌, మే నెలలో ఇజ్రాయెల్‌కు 6 వేల మంది నిర్మాణ కార్మికులు వెళ్లాల్సి ఉంది. మరోవైపు బ్రిటన్‌ కూడా తమ పౌరులు తక్షణం ఇజ్రాయెల్‌ వీడాలని సూచించింది. ఇరాన్‌, లెబనాన్‌, ఇజ్రాయెల్‌, పాలస్తీనా భూభాగాలకు ఫ్రెంచ్‌ పౌరులెవరూ వెళ్లొద్దని ఫ్రాన్స్‌ అడ్వయిజరీ జారీ చేసింది. టెహ్రాన్‌లోని ఫ్రెంచ్‌ దౌత్యవేత్తలు కూడా కుటుంబాలతో సహా తక్షణం ఇరాన్‌ను వీడాలని పేర్కొంది. చైనా కూడా ఇజ్రాయెల్‌లోని తమ పౌరులను అప్రమత్తం చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని