బ్రిటన్‌ కుటుంబ వీసా కఠినతరం..

వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది.

Updated : 13 Apr 2024 06:05 IST

అమల్లోకి కొత్త వేతన పరిమితి

లండన్‌: వలసలను అడ్డుకునేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని అమల్లోకి తెచ్చింది. కుటుంబ వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసింది. బ్రిటిష్‌ పౌరులు, శాశ్వత నివాసితులు (భారత వారసత్వం ఉన్నవారితో సహా) తమ బంధువులను కుటుంబ వీసాపై తీసుకురావాలనుకుంటే.. అందుకు కనీస వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55 శాతం మేర పెంచింది. బ్రిటన్‌ సర్కారు గతేడాదే ఈ విషయాన్ని ప్రకటించగా.. గురువారం నుంచి ఈ నిబంధన అమల్లోకి వచ్చింది. ఇక నుంచి ఎవరైనా కుటుంబ వీసాకు స్పాన్సర్‌ చేయాలంటే.. వారి కనీస వార్షిక వేతనం 29,000 జీబీపీ (గ్రేట్‌ బ్రిటన్‌ పౌండ్‌)లుగా ఉండాలని బ్రిటన్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. గతంలో ఈ పరిమితి 18,600 జీబీపీలుగా ఉండగా.. ఇప్పుడు దాన్ని 55 శాతం మేర పెంచారు. అంతేకాదు, వచ్చే ఏడాది నుంచి వృత్తి నిపుణుల వీసా నిబంధనలతో సమానంగా కుటుంబ వీసాల కోసం వేతన పరిమితిని 38,700 పౌండ్లకు పెంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. ‘‘దేశంలోకి వలసలు విపరీతంగా పెరుగుతున్న వేళ ఇంతకంటే సులభమైన పరిష్కారం మాకు కన్పించలేదు. చట్టపరమైన వలసలతో బ్రిటన్‌లోని పన్ను చెల్లింపుదారులపై భారం పడకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని బ్రిటన్‌ హోం మంత్రి జేమ్స్‌ క్లెవర్లీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని