ఇజ్రాయెలీ కుబేరుడి నౌక హైజాక్‌

ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో మరో అగ్గిరాజేసే కీలక పరిణామం చోటుచేసుకుంది.

Updated : 14 Apr 2024 06:53 IST

హర్మూజ్‌ జలసంధిలో ఇరాన్‌ దూకుడు
హెలికాప్టర్లతో వెంబడించి మరీ అధీనంలోకి..
సిబ్బందిలోని 25 మందిలో 17 మంది భారతీయులే
నివురుగప్పిన నిప్పులా పశ్చిమాసియా
అమెరికా యుద్ధనౌకల రంగ ప్రవేశం
సర్వసన్నద్ధంగా ఇజ్రాయెల్‌

దుబాయ్‌/టెహ్రాన్‌: ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియాలో మరో అగ్గిరాజేసే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్‌-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళ.. ఇరాన్‌ దూకుడుగా వ్యవహరించింది. హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెల్‌ వ్యాపారవేత్తకు చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను హెలికాప్టర్లతో వెంబడించి మరీ శనివారం ఇరాన్‌ తన అధీనంలోకి తీసుకుంది. ఈ ఆపరేషన్‌లో ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ దళాల (ఐఆర్‌జీసీ) ప్రత్యేక కమాండోలు పాల్గొన్నారు. నౌకలో 25 మంది సిబ్బంది ఉన్నారు. అందులో 17 మంది భారతీయులే. పోర్చుగీసు జెండాతో ప్రయాణిస్తున్న  ఈ నౌకను హర్మూజ్‌ జలసంధికి దగ్గరకు రాగానే ఐఆర్‌జీసీ ప్రత్యేక కమాండోలు చుట్టుముట్టారు. హెలికాప్టర్‌ నుంచి నౌకపైకి దిగారు. సిబ్బందిని అదుపులోకి తీసుకొని నౌకను తమ ప్రాదేశిక జలాలవైపునకు మళ్లించారు. లండన్‌ నుంచి వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇజ్రాయెలీ కుబేరుడు ఇయాల్‌ ఒఫర్‌కు చెందిన నౌకగా దీన్ని గుర్తించారు. నౌకను ఇరాన్‌ నియంత్రణలోకి తీసుకున్న విషయాన్ని బ్రిటన్‌కు చెందిన యూకే మారిటైమ్‌ ఏజెన్సీ కూడా ధ్రువీకరించింది. ఈ నెల ఆరంభంలో సిరియాలోని ఇరాన్‌ రాయబార కార్యాలయంపై గగనతల దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దాడిలో ఐఆర్‌జీసీకి చెందిన పలువురు సీనియర్‌ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. దాడికి ఇజ్రాయెలే కారణమని, ఆ దేశాన్ని తాము శిక్షిస్తామని ఇరాన్‌ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రేపో మాపో ఇజ్రాయెల్‌పై నేరుగా ఆ దేశం దాడి చేస్తుందని అందరూ భావించారు. అనూహ్యంగా ఇజ్రాయెల్‌ కుబేరుడి నౌకను హైజాక్‌ చేయడం గమనార్హం.

నౌకలను హైజాక్‌ చేయడం సముద్రపు దొంగల పని అని.. ఇప్పుడు ఇరాన్‌ కూడా ఆ దొంగల్లానే వ్యవహరించిందని ఇజ్రాయెల్‌ మండిపడింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడి చేయడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌కు తాము పూర్తిగా అండగా ఉంటామని పునరుద్ఘాటించారు. అన్నిరకాలుగా టెల్‌ అవీవ్‌కు సాయం చేస్తామని.. ఆ దేశ భద్రతకు తాము హామీ అని తెలిపారు. దాడి చేసే సాహసం చేయొద్దని ఇరాన్‌ను ఆయన హెచ్చరించారు. మరోవైపు ఇజ్రాయెల్‌కు రక్షణగా యుద్ధ నౌకలను, దళాలను పశ్చిమాసియాకు అమెరికా తరలించే ప్రక్రియ చేపట్టింది.మరోవైపు ఇజ్రాయెల్‌ యుద్ధ సన్నద్ధతను పెంచింది. ఆ దేశ యుద్ధ విమానాలు గగనతలంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇజ్రాయెల్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. 1000 మందికి మించి ఎక్కడా గుమికూడవద్దని హెచ్చరికలు జారీచేశారు.

ఇరాన్‌తో మాట్లాడుతున్నాం: భారత్‌

నౌకలోని 17 మంది భారతీయులను రక్షించడానికి భారత్‌ రంగంలోకి దిగింది. దౌత్యమార్గాల్లో ఇరాన్‌తో సంప్రదింపులు ప్రారంభించింది. ఈ మేరకు విదేశీవ్యవహారాల శాఖ అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు