అవిభక్త వృద్ధ కవలలు లోరి, జార్జ్‌ కన్నుమూత

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ అవిభక్త కవలలుగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించుకున్న లోరి, జార్జ్‌ షాపెల్‌లు ఈ నెల ఏడో తేదీన అమెరికాలోని పెన్సిల్వేనియా ఆసుపత్రిలో కన్నుమూశారు.

Published : 14 Apr 2024 05:17 IST

రీడింగ్‌: ప్రపంచంలోనే అత్యంత వృద్ధ అవిభక్త కవలలుగా గిన్నిస్‌ పుస్తకంలో చోటు సంపాదించుకున్న లోరి, జార్జ్‌ షాపెల్‌లు ఈ నెల ఏడో తేదీన అమెరికాలోని పెన్సిల్వేనియా ఆసుపత్రిలో కన్నుమూశారు. వారి మరణానికి కారణం తెలియరాలేదు. ‘‘సెప్టెంబరు 18, 1961న పెన్సిల్వేనియాలోని వెస్ట్‌ రీడింగ్‌లో వేర్వేరు మెదళ్లతో, అతుక్కున్న పుర్రెతో లోరి, జార్జ్‌లు జన్మించారు. స్పైనా బైఫిడా ఉన్న జార్జ్‌.. లోరి కంటే నాలుగు అంగుళాలు పొట్టి. ప్రత్యేకంగా తయారుచేసిన చక్రాల కుర్చీతో ఎప్పుడూ లోరి చుట్టూనే ఉండేవారు. ఒకరు ఎక్కడకు వెళ్లినా మరొకరు తప్పకుండా వెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ.. ఇద్దరూ సాధ్యమైనంత మేర  స్వతంత్రంగా జీవించారు. ‘‘మేం పుట్టినప్పుడు కనీసం 30 ఏళ్లు కూడా బతకలేమని వైద్యులు భావించారు. కానీ, మేం అది తప్పని నిరూపించాం’’ అని 50వ పడిలో ప్రవేశించిన సమయంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో లోరీ పెర్కొన్నారు. 2007 తాను ట్రాన్స్‌జెండర్‌ అని జార్జ్‌ ప్రకటించారు. గతంలో ఓ వ్యక్తితో లోరీకి నిశ్చితార్థం జరిగింది. అనంతరం అతను వాహన ప్రమాదంలో మరణించారు.‘‘నేను డేట్‌కు వెళ్లిన సమయంలో చదువుకునేందుకు జార్జ్‌ వెంట పుస్తకాలు ఉండేవి’’ అని గతంలో లోరీ పేర్కొంది. ఇద్దరు తోబుట్టువులు పబ్లిక్‌ హైస్కూల్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు. గతంలో లోరీ ఆరేళ్లపాటు ఆసుపత్రి లాండ్రీలో ఉద్యోగం చేయగా అప్పుడు జార్జ్‌ కూడా వెంట ఉన్నారు. అనంతరం 1996లో లోరీ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని