టెహ్రాన్‌ అదుపులోనే 17 మంది భారతీయ నౌకా సిబ్బంది

పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ అదుపులోకి తీసుకున్న నౌకలోని ఓ కేరళ మహిళ సహా 17 మంది భారతీయ సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. అయితే వారిని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు కలిసేందుకు మాత్రం అనుమతి లభించింది.

Published : 16 Apr 2024 04:47 IST

 ఇరాన్‌ విదేశాంగమంత్రితో మాట్లాడిన జైశంకర్‌
పాక్‌ జాతీయులు మాత్రం విడుదల

దిల్లీ: పర్షియన్‌ గల్ఫ్‌లో ఇరాన్‌ అదుపులోకి తీసుకున్న నౌకలోని ఓ కేరళ మహిళ సహా 17 మంది భారతీయ సిబ్బంది ఇంకా విడుదల కాలేదు. అయితే వారిని టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయ అధికారులు కలిసేందుకు మాత్రం అనుమతి లభించింది. ఈ మేరకు ఇరాన్‌ విదేశాంగ మంత్రిత్వశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. శనివారం హర్మూజ్‌ జలసంధి సమీపంలో ఇజ్రాయెలీ కుబేరుడికి చెందిన వాణిజ్య నౌక ఎంఎస్‌సీ ఏరిస్‌ను ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ దళం హెలికాప్టర్లతో వెంబడించి అధీనంలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది ఉండగా.. అందులో 17 మంది భారతీయులు. ఈ క్రమంలోనే వారిని విడిపించేంద]ుకు విదేశీవ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.జైశంకర్‌ ఆదివారం ఇరాన్‌ విదేశాంగశాఖ మంత్రి హుసేన్‌ అమీర్‌ అబ్దుల్లాహియాన్‌తో మాట్లాడారు. భారతీయులను విడుదల చేయాలని కోరారు. అబ్దుల్లాహియాన్‌ సానుకూలంగా స్పందించారు. మరోవైపు నౌకలోని పాకిస్థానీయులను విడుదల చేస్తున్నట్టు ఇరాన్‌ ప్రకటించింది. ఈ నెల 22న పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఇరాన్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. నౌకలోని భారతీయ మహిళను కేరళలోని త్రిశ్శూర్‌కు చెందిన అంటెస్సా జోసెఫ్‌గా గుర్తించారు. ‘‘మా అమ్మాయి రోజూ ఫోన్‌ చేస్తుంది. ఈ ఘటన జరిగిన రోజున చేయలేదు. మధ్యాహ్నం నౌక యాజమాన్యం ఫోన్‌ చేసి జరిగిన విషయాన్ని మాకు చెప్పింది’’ అని సోమవారం మహిళ తండ్రి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని