ఇజ్రాయెల్‌ X ఇరాన్‌.. ఎవరి బలం ఎంత?

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గతంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ముఖాముఖి ఎన్నడూ తలపడలేదు.

Updated : 16 Apr 2024 07:32 IST

ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ దాడితో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. గతంలో పరోక్షంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న ఈ రెండు దేశాలు ముఖాముఖి ఎన్నడూ తలపడలేదు. ఇప్పుడు ఇజ్రాయెల్‌ నేరుగా ఇరాన్‌పై దాడి చేస్తే మాత్రం పశ్చిమాసియాలో మరో పూర్తిస్థాయి యుద్ధానికి తెరలేచినట్లవుతుంది. ఈ నేపథ్యంలో ఆయుధపరంగా, సైనిక పరంగా ఈ రెండు దేశాల బలబలాలు ఎలా ఉన్నాయంటే..


అవే ఇరాన్‌ శక్తి

సైనికబలం పరంగా ఇరాన్‌.. ప్రపంచంలోనే 14వ స్థానంలో ఉండగా ఇజ్రాయెల్‌ 17వ ర్యాంకులో ఉంది. ఇరాన్‌ వద్ద ఉన్న ప్రధాన అస్త్రాలు.. బాలిస్టిక్‌ క్షిపణులు, సాయుధ డ్రోన్లు. వీటిని ఆ దేశం పెద్ద సంఖ్యలో అభివృద్ధి చేసింది. పశ్చిమాసియాలో ఇంత పెద్ద సంఖ్యలో ఈ అస్త్రాలను పోగేసుకున్న దేశం మరొకటి లేదు. 3వేల వరకూ క్షిపణులు ఇరాన్‌ వద్ద ఉన్నాయి. వాటిలో కొన్ని 12 నిమిషాల్లోగా ఇజ్రాయెల్‌ను చేరుకోగలవు. క్రూజ్‌ క్షిపణులకు   2 గంటలు, డ్రోన్లకు 9 గంటలు పడుతుంది.


క్రూజ్‌ క్షిపణులు

ఇరాన్‌ వద్ద కేహెచ్‌-55 అనే క్రూజ్‌ క్షిపణులు కూడా ఉన్నాయి. గగనతలం నుంచి ప్రయోగించే వీలున్న ఈ అస్త్రం.. అణు వార్‌హెడ్‌నూ మోసుకెళ్లగలదు. 3 వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు. ఖలీద్‌ ఫర్జ్‌ అనే నౌకా విధ్వంసక క్షిపణి కూడా ఇరాన్‌ అమ్ములపొదిలో ఉంది. అది వెయ్యి కిలోల వార్‌హెడ్‌ను 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లగలదు.


సాయుధ డ్రోన్లపై తిరుగులేని పట్టు

సాయుధ డ్రోన్లకు సంబంధించి ఇరాన్‌ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. రష్యా సహా అనేక దేశాలకూ వీటిని ఎగుమతి చేస్తోంది. ఉక్రెయిన్‌పై ప్రయోగిస్తున్న షాహిద్‌ డ్రోన్లు ఇరాన్‌ సరఫరా చేసినవే. కొద్దినెలల కిందట మొహజెర్‌-10 అనే అధునాతన డ్రోన్‌ను ఇరాన్‌ అభివృద్ధి చేసింది. అది 2వేల కిలోమీటర్ల దూరం పయనించగలదు. 300 కిలోల ఆయుధాలతో ఏకబిగిన 24 గంటలు  గగనవిహారం చేయగలదు.

  • హైపర్‌సోనిక్‌ బాలిస్టిక్‌ క్షిపణిని అభివృద్ధి చేసినట్లు ఇరాన్‌ ప్రకటించింది. ఇలాంటి అస్త్రాలు.. ధ్వని కన్నా కనీసం ఐదురెట్లు వేగంగా దూసుకెళ్లగలవు.
  • ఇరాన్‌ అమ్ములపొదిలోని ప్రధాన గగనతల రక్షణ వ్యవస్థ ఎస్‌-300. ఇజ్రాయెల్‌ వద్ద ఉన్న ఆధునిక వ్యవస్థలతో పోల్చినప్పుడు ఇది దిగదుడుపే. దేశీయంగా ఉత్పత్తి చేసిన బావర్‌-373 అస్త్రాలు, అర్మాన్‌, అజరక్ష్ వ్యవస్థలు ఉన్నాయి.


ఇజ్రాయెల్‌ ఖండాంతర శక్తి

ఇజ్రాయెల్‌ వద్ద కూడా శక్తిమంతమైన క్షిపణులు ఉన్నాయి. అందులో ఖండాంతర అస్త్రాలూ ఉన్నాయి. ఇజ్రాయెల్‌ క్షిపణుల్లో ప్రధానమైనవి..


క్షిపణి     పరిధి
జెరికో-1   1,400 కిలోమీటర్లు    
జెరికో-2   2,800 కిలోమీటర్లు
జెరికో-3   5,000 కిలోమీటర్లు

  • ఇంకా స్వల్పశ్రేణి లోరా, డెలైలా, గాబ్రియేల్‌ క్షిపణులు ఉన్నాయి.

గగనతల రక్షణలో ఇజ్రాయెల్‌ది తిరుగులేని శక్తి. ఆదివారం ఇరాన్‌ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లలో 99 శాతాన్ని ఆకాశంలోనే నేలకూల్చినప్పుడు ఇది మరోసారి తేటతెల్లమైంది. ప్రత్యర్థి క్షిపణులను గాల్లోనే పేల్చేయగల పేట్రియాట్‌, యారో, డేవిడ్‌ స్లింగ్‌, ఐరన్‌ డోమ్‌ వంటి వ్యవస్థలు ఇజ్రాయెల్‌ వద్ద ఉన్నాయి.

  • ఇజ్రాయెల్‌ వద్ద కూడా భారీగానే డ్రోన్లు ఉన్నాయి. అయితే వీటిలో చాలావరకూ ఆయుధాలు మోసుకెళ్లేవి కావు. అవి ప్రధానంగా నిఘా, సమాచార సేకరణకు ఉద్దేశించినవే.

అణ్వస్త్రాలు

ఇరాన్‌ అణ్వాయుధాలను నిర్మించడానికి ప్రయత్నిస్తోందన్న ఆరోపణలు ఉన్నప్పటికీ.. అవి వార్‌హెడ్‌లో  అమర్చడానికి అనువుగా సిద్ధమయ్యాయా అనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు ఇజ్రాయెల్‌ వద్ద  90 అణు బాంబులు ఉన్నట్లు అంచనా. దీనికితోడు 800  కిలోటన్నుల నుంచి 12 మెగా టన్నుల సామర్థ్యం కలిగిన అణు, థర్మోన్యూక్లియర్‌ వార్‌హెడ్లను మోసుకెళ్లే ఖండాంతర క్షిపణులనూ ఆ దేశం అభివృద్ధి చేస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి.


సంప్రదాయ సైనిక బలాబలాలు

సైనికపరంగా ఇరాన్‌, ఇజ్రాయెల్‌లు శక్తిమంతమైన దేశాలే. జనాభా, విస్తీర్ణంపరంగా ఇజ్రాయెల్‌తో పోలిస్తే ఇరాన్‌ చాలా పెద్దది. సంఖ్యాపరంగా కూడా ఇరాన్‌ వద్ద ఉన్న ఆయుధ సంపత్తి ఎక్కువే.  అయితే 1979 నుంచి వివిధ రూపాల్లో ఆంక్షలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆ దేశం వద్ద ఉన్న సంప్రదాయ ఆయుధాల్లో చాలావరకూ కాలం చెల్లినవే. ఇజ్రాయెల్‌ వద్ద అధునాతన ఆయుధ సంపత్తి ఉంది. ఆ ప్రాంతం మొత్తంలోకీ అత్యంత సుశిక్షిత సైనిక సిబ్బంది ఆ దేశం సొంతం. ఇరాన్‌ సైన్యంలోని రివల్యూషనరీ గార్డ్స్‌ దళం, ఖుద్స్‌ ఫోర్స్‌లకూ సంప్రదాయేతర యుద్ధాల్లో మంచి నైపుణ్యం ఉంది.

 

 ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని