రొమ్ము క్యాన్సర్‌తో ఏడాదికి 10 లక్షల మరణాలు!

ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్‌ మహమ్మారి ముప్పు ముంచుకొస్తోందని లాన్సెట్‌ కమిషన్‌ హెచ్చరించింది. 2040 నాటికి ఏడాదికి పది లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించే అవకాశం ఉందని తెలిపింది.

Published : 17 Apr 2024 04:56 IST

2040 నాటికి ఎదురయ్యే పరిస్థితిపై లాన్సెట్‌ కమిషన్‌ హెచ్చరిక
ముందస్తు జాగ్రత్తలతో ముప్పు నివారణ సాధ్యమేనని వెల్లడి

దిల్లీ: ప్రపంచవ్యాప్తంగా రొమ్ము క్యాన్సర్‌ మహమ్మారి ముప్పు ముంచుకొస్తోందని లాన్సెట్‌ కమిషన్‌ హెచ్చరించింది. 2040 నాటికి ఏడాదికి పది లక్షల మరణాలు ఈ వ్యాధి కారణంగానే సంభవించే అవకాశం ఉందని తెలిపింది. 2020 నుంచి ఈ వ్యాధి విస్తృతి తీరును సంస్థ విశ్లేషించి ఈ నిర్ధారణకు వచ్చింది. అదే ఏడాది 6,85,000 మంది మహిళలు దీనివల్ల ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. అప్పటికి ముగిసిన అయిదేళ్లలో 78 లక్షల మంది మహిళలకు రొమ్ము క్యాన్సర్‌ సోకిందని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా 75 ఏళ్ల వయసు వచ్చేసరికి ప్రతి 12 మంది మహిళల్లో ఒకరు సగటున ఈ క్యాన్సర్‌ బారినపడుతున్నట్లు తమ పరిశోధనలను ఉటంకిస్తూ ఈ సంస్థ వెల్లడించింది. 2020లో ఇటువంటి బాధితుల సంఖ్య 23 లక్షలు కాగా 2040కి 30 లక్షలకు పెరుగుతారని ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా పేద, వర్దమాన దేశాల్లో వ్యాధిగ్రస్తుల సంఖ్య అత్యధికంగా ఉంటుందని తెలిపింది. అయితే, ధనిక దేశాల్లో తీసుకుంటున్న చర్యలు, ఆధునిక వసతులు, ప్రజల చైతన్యం వల్ల మరణాలను గణనీయంగా తగ్గించగలుగుతున్నారని నివేదిక రచయిత, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్‌ కేంబ్రిడ్జికి చెందిన షాలట్‌ కోల్జ్‌ తెలిపారు. సకాలంలో చికిత్సలు పొందిన రొమ్ము క్యాన్సర్‌ బాధితుల్లో.... ధనిక దేశాల్లో 90 శాతం, భారత్‌ వంటి వర్దమాన దేశాల్లో 66శాతం, దక్షిణాఫ్రికా వంటి పేద దేశాల్లో 40 శాతం మంది ప్రాణ హాని నుంచి బయటపడుతున్నారని నివేదిక స్పష్టం చేసింది. ప్రజల్లో ఇంకా ఈ వ్యాధిపై అవగాహన, ఆధునిక వైద్య వసతులను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, మద్యం వినియోగంపై నియంత్రణ, అధిక బరువును తగ్గించుకుని చురుకైన జీవన విధానాలు అనుసరిస్తే క్యాన్సర్‌పై పోరులో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉందని పేర్కొంది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని