అమెరికాలో హిందువులపై పెరిగిన దాడులు

అమెరికాలో హిందువులపై దాడులు గణనీయంగా పెరిగాయని, ఇవి మరింత ఉద్ధృతం కావొచ్చని ఇండో-అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ థానేదార్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 17 Apr 2024 06:04 IST

భారతీయ అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ థానేదార్‌ ఆందోళన

వాషింగ్టన్‌: అమెరికాలో హిందువులపై దాడులు గణనీయంగా పెరిగాయని, ఇవి మరింత ఉద్ధృతం కావొచ్చని ఇండో-అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యుడు శ్రీ థానేదార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడ విలేకర్ల సమావేశంలో పాల్గొన్న శ్రీ థానేదార్‌.. దాడుల దృష్ట్యా హిందువులు మరింత కలిసికట్టుగా ఉండాలని కోరారు. ‘కాలిఫోర్నియా, న్యూయార్క్‌ సహా అమెరికా అంతటా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. ఇవి పథకం ప్రకారం జరుగుతున్న దాడులు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌ అనే తేడా లేకుండా భారీ స్థాయిలో హిందువులకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం సాగుతోంది. దీనికి వ్యతిరేకంగా అందరం కలసికట్టుగా ముందుకుసాగాలి. దీనికి నా మద్దతు ఉంటుంది’ అని పేర్కొన్నారు.  హిందూ మతం శాంతియుతమైందని, ఇతర మతస్థులపై దాడులను ప్రోత్సహించదని ఆయన చెప్పారు. దాడులపై స్థానిక దర్యాప్తు సంస్థలు విచారణ చేపడుతున్నప్పటికీ, వాటిలో పురోగతి ఉండటం లేదని పేర్కొన్నారు. ఎఫ్‌బీఐ, న్యాయశాఖల సమన్వయంతో ఈ దాడులపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతూ తనతో పాటు హిందూ మతానికి చెందిన మరో ముగ్గురు కాంగ్రెస్‌ సభ్యులు అమెరికా న్యాయశాఖకు ఇటీవల లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.


కోర్టులో కునుకు తీసిన ట్రంప్‌..?

ఇంటర్నెట్‌ డెస్క్‌: శృంగార తార స్టార్మీ డేనియల్‌ కేసులో న్యూయార్క్‌ న్యాయస్థానంలో రెండో రోజూ విచారణ జరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విచారణ సందర్భంగా నిద్రలోకి జారుకున్నారని కొన్ని మీడియా సంస్థలు కథనాలు ప్రచురించాయి. కుర్చీలో చేతులు కట్టుకుని కూర్చున్న ట్రంప్‌.. మెల్లగా తన కళ్లు మూస్తూ మధ్యలో ఆవలించారని పేర్కొన్నాయి. నిద్రను నియంత్రించేందుకు ఆయన ప్రయత్నించారని తెలిపాయి. విచారణ వేళ కోర్టు గదిలో కూర్చునేందుకు అనుమతి తీసుకున్న కొందరు జర్నలిస్టులు ఇదంతా గమనించారు. ట్రంప్‌ న్యాయవాది అప్రమత్తం చేసే ప్రయత్నం చేసినప్పటికీ వాటిని ఆయన అంతగా పట్టించుకోలేదని తెలుస్తోంది. నిద్ర కమ్ముకురావడంతో కాసేపు తన తలను కిందకు దించినట్లు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని