మొక్కల సెన్సర్లతో రైతులకు ముందస్తు హెచ్చరికలు

మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.

Published : 18 Apr 2024 05:00 IST

వాషింగ్టన్‌: మొక్కలకు ఎదురవుతున్న ముప్పును చాలా త్వరగా పసిగట్టి, రైతులను అప్రమత్తం చేసే సెన్సర్లను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. తీవ్రస్థాయి వేడి లేదా కాంతి, చీడపీడలు, కీటకాల దాడుల గురించి ఇవి ముందస్తు హెచ్చరికలు చేయగలవని వారు పేర్కొన్నారు. కర్బన నానోగొట్టాలతో తయారైన ఈ సెన్సర్లను అమెరికా, సింగపూర్‌ శాస్త్రవేత్తలు రూపొందించారు. ఒత్తిడి పరిస్థితి ఎదురైనప్పుడు మొక్కలు హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌, శాలిసిలిక్‌ యాసిడ్‌ను విడుదల చేస్తాయి. ఒత్తిడి రకాన్ని బట్టి ఈ రసాయనాల తీరుతెన్నులు ఉంటాయి. అంతర్లీనంగా వీటిలో భిన్న పోకడలు కనిపిస్తాయి. ‘‘సందర్భాన్ని బట్టి మొక్కలోని రసాయనాల విడుదల హెచ్చుతగ్గులకు లోనవుతుంటుంది. ఒక్కో మార్పు.. నిర్దిష్టంగా ఒక్కో ఒత్తిడికి సంకేతంగా ఉంటుంది. వీటిని పసిగట్టడానికి కర్బన నానోగొట్టాలతో సెన్సర్లును అభివృద్ధి చేశాం. వాటికి పాలిమర్‌ తొడుగులు ఉంటాయి. ఈ పాలిమర్ల త్రీడీ ఆకృతులను మార్చడం ద్వారా.. భిన్న రసాయనాలను గుర్తించేలా తీర్చిదిద్దవచ్చు. లక్షిత రసాయన ఆనవాళ్లు కనిపించినప్పుడు అది ఫ్లోరోసెంట్‌ సంకేతాన్ని వెలువరిస్తుంది’’ అని పరిశోధనలో పాలుపంచుకున్న మైఖేల్‌ స్ట్రానో తెలిపారు. రైతులకు అవి ముందస్తు హెచ్చరికలుగా పనికొస్తాయని పేర్కొన్నారు. తద్వారా.. పంట పూర్తిగా నాశనం కాకముందే మేలుకొని, సస్యరక్షణ చర్యలు చేపట్టడానికి వీలవుతుందని తెలిపారు. మొక్కకు నిర్దిష్టంగా ఎలాంటి ఒత్తిడి ఎదురవుతోందన్నది ఈ సెన్సర్లు చెబుతాయని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని