భారీ వర్షాలతో దుబాయ్‌ అతలాకుతలం

పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని దుబాయ్‌ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది.

Updated : 18 Apr 2024 05:47 IST

నీటమునిగిన విమానాశ్రయం
పలు విమాన సర్వీసుల రద్దు

దుబాయ్‌: పశ్చిమాసియాలో ప్రధాన ఆర్థిక కేంద్రమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌(యూఏఈ)లోని దుబాయ్‌ భారీ వర్షాలతో అతలాకుతలం అయ్యింది. నిత్యం రద్దీగా ఉండే స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయంలో వరద చేరి విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రన్‌వేపై మోకాలిలోతు నీరు ఉండటంతో ఇక్కడికి వచ్చే విమానాలను దారిమళ్లిస్తున్నారు. ఈ పరిస్థితుల కారణంగా భారత్‌-దుబాయ్‌ మధ్య 28 విమానాలు రద్దయ్యాయి. భారత్‌ నుంచి దుబాయ్‌కు వచ్చే 15, దుబాయ్‌ నుంచి భారత్‌కు వెళ్లే 13 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయన్నారు. వీలైనంత వేగంగా ఎయిర్‌పోర్టులో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దుబాయ్‌ విమానాశ్రయ అధికార ప్రతినిధి తెలిపారు. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ వ్యాప్తంగా సోమవారం రాత్రి మొదలైన వర్షాలు మంగళవారానికి కుంభవృష్టిగా మారాయి. 24 గంటల వ్యవధిలో 142 మి.మీ. వర్షం కురింది. వాస్తవానికి దేశ సరాసరి సగటు వర్షపాతం 94.7 మి.మీ. కావడం గమనార్హం.

పాకిస్థాన్‌లో 63కు చేరిన వర్షాల మృతులు

పెషావర్‌: పాకిస్థాన్‌లో భారీ వర్షాల కారణంగా బుధవారం 14 మంది మరణించారు. నాలుగు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మొత్తం మరణాల సంఖ్య 63కు చేరిందని అధికారులు బుధవారం వెల్లడించారు. పాకిస్థాన్‌ వాయవ్య ప్రాంతంలోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌ నుంచి అధిక మరణాలు నమోదయ్యాయి. భవనాలు కూలిపోవడం వల్ల 32 మంది మరణించారని, అందులో చిన్నారులు 15 మంది, మహిళలు ఐదుగురు ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి తెలిపారు. 1,370 భవనాలు ధ్వంసం అయినట్లు పేర్కొన్నారు. పంజాబ్‌ తూర్పు ప్రావిన్స్‌లో 21 మరణాలు నమోదయ్యాయి. బలూచిస్థాన్‌లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని