ఇజ్రాయెల్‌ దాడి చేయడం ఖాయం

ఇరాన్‌పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు.

Updated : 18 Apr 2024 05:46 IST

ఎలా చేయాలో మేమే నిర్ణయించుకుంటాం: నెతన్యాహు

జెరూసలెం: ఇరాన్‌పై ప్రతీకార దాడి ఎప్పుడు.. ఎలా చేయాలనే అంశంపై తమ దేశమే నిర్ణయం తీసుకుంటుందని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు స్పష్టం చేశారు. ఈ విషయంలో మిత్ర దేశాల సూచనలను తాము పట్టించుకోబోమని తెలిపారు. బుధవారం కేబినెట్‌ సహచరులతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇరాన్‌పై దాడి చేయాలన్న నిర్ణయాన్ని ఇజ్రాయెల్‌ తీసుకుందని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ కామెరూన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన టెల్‌ అవీవ్‌ పర్యటనలో ఉన్నారు. బుధవారం ఆయన బెంజమిన్‌ నెతన్యాహును కలిశారు. ఈ సందర్భంగా దాడి విషయాన్ని నెతన్యాహు.. కామెరూన్‌కు తెలిపారు. ‘‘ఇరాన్‌పై స్పందించాలని ఇజ్రాయెలీలు నిర్ణయించుకున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచకుండా తెలివిగా, బలంగా స్పందించాలని మేం చెప్పాం’’ అని కామెరూన్‌ అన్నారు. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ కూడా నెతన్యాహుతో ఫోన్‌లో మాట్లాడారు. నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు.  జర్మనీ విదేశాంగ మంత్రి బేర్‌బాక్‌ కూడా టెల్‌అవీవ్‌లోనే ఉన్నారు. ‘‘అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నియంత్రణ పాటించాలి. ఇప్పటికే దాడిని అడ్డుకొని ఇజ్రాయెల్‌ విజయం సాధించింది’’ అని చెప్పారు.

తీవ్ర పరిణామాలు తప్పవు: ఇరాన్‌

కాగా తమ దేశంపై పరిమిత స్థాయిలో దాడికి దిగినా.. పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని ఇజ్రాయెల్‌ను ఇరాన్‌ ప్రధాని ఇబ్రహీం రైసీ హెచ్చరించారు. తాము మరింత భారీ దాడులకు దిగితే ఇజ్రాయెల్‌ మిగలదని హెచ్చరించారు. వార్షిక సైనిక పరేడ్‌లో ఆయన మాట్లాడారు. మరోవైపు ఉత్తర ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా డ్రోన్‌ దాడి చేసింది. ఈ ఘటనలో 14 మంది ఇజ్రాయెల్‌ సైనికులు, నలుగురు పౌరులు గాయపడ్డారు. దీనికి ప్రతీకారంగా లెబనాన్‌లోని బాల్బెక్‌ జిల్లాలో దాడులకు దిగామని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. లాట్‌ పట్టణానికి సమీపంలో ఈ దాడి జరిగిందని వెల్లడించింది.


ఇజ్రాయెల్‌ దాడిలో వేల సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాల ధ్వంసం

ఇంటర్నెట్‌ డెస్క్‌: హమాస్‌ ఉగ్రవాదుల అంతమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్‌ చేస్తున్న దాడుల్లో కృత్రిమ గర్భధారణ కోసం  వేల సంఖ్యలో నిల్వ ఉంచిన పిండాలు, వీర్య నమూనాలు దెబ్బతిన్నాయి. గతేడాది డిసెంబరులో గాజాలోని అతిపెద్ద వైద్య కేంద్రాల్లో ఒకటైన అల్‌ బాస్మా ఐవీఎఫ్‌ సెంటర్‌పై ఇజ్రాయెల్‌ సేనలు దాడులు జరిపాయి. ఆ సమయంలో ఆసుపత్రిలోని ఎంబ్రియాలజీ యూనిట్‌లో ఉన్న ఐదు లిక్విడ్‌ నైట్రోజన్‌ ట్యాంకులు దెబ్బతిన్నాయి. అత్యంత శీతలంగా ఉండే ద్రవం ఆవిరైపోవడంతో.. ట్యాంకుల లోపల ఉష్ణోగ్రతలు పెరిగాయి. దాంతో అందులో ఉన్న భారీ సంఖ్యలో పిండాలు, వీర్య నమూనాలతోపాటు ఫలదీకరణం చెందని అండాలు ఛిద్రమైనట్లు గుర్తించారు. ఈ పరిణామం సంతానం లేని వందల మంది పాలస్తీనీయన్‌ దంపతులకు తీరని వేదనను మిగిల్చిందని ఐవీఎఫ్‌ సెంటర్‌ నిర్వాహకులు వెల్లడించారు. ‘‘దాదాపు ఐదు వేల నమూనాల్లో ప్రాణాలు లేదా జీవం పోసుకునే అవకాశం ఉన్నవి అధికంగా ఉన్నాయి. ఇందులో సగానికి పైగా దంపతుల నుంచి మళ్లీ నమూనాలు సేకరించడం కష్టమే. ఇవన్నీ నాశనం కావడం చూస్తుంటే నా హృదయం ముక్కలై పోయింది’ అని ఐవీఎఫ్‌ సెంటర్‌ నిర్వహిస్తోన్న డాక్టర్‌ బహేలిద్దీన్‌ ఘలాయినీ వాపోయారు. ఐవీఎఫ్‌ పద్ధతిలో సంతానం పొందేందుకు అయ్యే ఖర్చు కోసం ఎంతో మంది దంపతులు తమ టీవీలు, నగలను సైతం అమ్ముకున్నారని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని